నల్లగా
నాసిరకంగా ఉన్న బెల్లం
రామభద్రపురం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రుచికరమైన పౌష్టికాహారం అందించాల్సి ఉండగా.. ఆ దిశగా ఆలోచించకపో వడం బాధాకరం. ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ పేరుతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యంలో పురుగులు విలవిల్లాడుతున్నాయి. అలాగే, రాగిజావలో వినియోగించే బెల్లం కూడా నల్లగా నాసిరకంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 1766 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1.10 లక్షల మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రతిరోజూ 99 వేల మంది వరకు విద్యార్థులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తింటున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వీరికి నాణ్యమైన బియ్యంతో భోజనం పెడుతున్నామని అధికారులు చెబుతున్నా.. పురుగులు పట్టిన బియ్యంతో వండిన ఆహారమే విద్యార్థులు తింటున్నట్లు సమాచారం. బెల్లం కూడా నాసిరకంగా ఉండడంతో రాగిజావ కూడా వాసన వస్తోందని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెబుతున్నారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అందించేందుకు మెనూలో మార్పులు చేశామని టీడీపీ పాలకులు ప్రచారం చేసుకుంటున్నా.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనని సమాచారం.
కానరాని పర్యవేక్షణ..?
జిల్లా విద్యాశాఖాధికారులు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై పర్యవేక్షణ చేపట్టడం లేదు. ఒకవేళ తనిఖీలు చేపట్టాలన్నా జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ పాఠశాలకు వెళ్లి తూతూమంత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. బియ్యంలో పురుగులు వస్తున్నాయన్న విషయాన్ని ఎంఈఓ తిరుమల ప్రసాద్ వద్ద ప్రస్తావించగా.. పౌరసరఫరాల శాఖ గోదాం నుంచి బియ్యం సరఫరా అవుతున్నాయన్నారు. సుంకు పురుగులు ఉన్నట్లు ఎక్కడ నుంచి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. అయినప్పటకీ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంతో కూటమి
చెలగాటం..!
ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యంలో పురుగులు
కానరాని ఉన్నతాధికారుల పర్యవేక్షణ


