పూసపాటిరేగ:
పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్ కమిటీలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సర్వసభ్య సమావేశంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవికి అవమానం జరిగింది. ప్రధాన టేబుల్‌కు ఎదురుగా కమిటీ చైర్మెన్ గేదెల గాయత్రికి సీటు వేసి, దానికి పక్కగా ఎమ్మెల్యేకు కుర్చీవేశారు. దీనిని అవమానంగా భావించిన ఎమ్మెల్యే.. సమావేశానికి హాజరైన నిమిషం వ్యవధిలోనే కార్యదర్సి సతీష్‌పై ఛలోక్తి విసిరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేకు సీటు పక్కన వేశారు... వచ్చే సమావేశంలో సీటు ఉండదేమో అంటూ అసహనం వ్యక్తం చేసి సమావేశం నుంచి నిష్క్రమించారు. దీనిని పట్టించుకోకుండా సమావేశాన్ని కార్యదర్సి సతీష్ యథావిధిగా కొనసాగించారు. దీనిపై జనసేన మద్దతుగా ఉన్న ఏఎంసీ వైస్ చైర్మెన్ బాసి దుర్గ , గోవిందపురం మాజీ వైస్ సర్పంచ్ బాలా అప్పలరాజు కార్యదర్శిని నిలదీశారు. ప్రొటోకాల్ పాటించకపోవడంపై ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యేకు సీటు పక్కన వేశారని ఆరోపించారు. అవమానంతో ఎమ్మెల్యే బయటకు వెళ్లిపోతున్నా సమావేశాన్ని కొనసాగించడంలో ఆంతర్యం ఏమిటి, ఏఎంసీలో ఏమి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ, జనసేన నుంచి ఎన్నికై న డైరెక్టర్లు సభను బహిష్కరించారు. దీనిపై ఏఎంసీ కార్యదర్శి సతీష్ స్పందిస్తూ సమావేశంలో ముందుగా ఎమ్మెల్యేకు సీటు వేశామని, తర్వాత మధ్యలో మార్పుచేసి మార్కెట్ కమిటీ చైర్మెన్ గేదెల గాయత్రికి సీటు వేసినట్టు తెలిపారు. చైర్మన్ గాయత్రి ఆదేశంతోనే సీటు స్థానంలో మార్పు చేసినట్టు వెల్లడించారు. చైర్మన్ గేదెల గాయత్రి భర్త రాజారావు స్పందిస్తూ సమావేశంలో అధ్యక్ష కుర్చీకి మొదటి ప్రాధాన్యం ఉంటుందని, పక్కన గౌరవ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధిలు కూర్చుంటారని, ఆనవాయితీ ప్రకారం సిబ్బంది కుర్చీలు ఏర్పాటు చేశారని సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ఎమ్మెల్యే కావాలనే సభ నుంచి వెళ్లి ఉండవచ్చుకదా అని తిరిగి ప్రశ్నించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమిలో సాగుతున్న రచ్చ కొత్తకాదంటూ అక్కడ ఉన్నవారు గుసగుసలాడారు.
పూసపాటిరేగ ఏఎంసీ సమావేశంలో
జనసేన ఎమ్మెల్యేకు పక్కగా వేసిన కుర్చీ
ప్రధాన కుర్చీలో ఏఎంసీ చైర్మన్
నిమిషం వ్యవధిలో నిష్క్రమించిన ఎమ్మెల్యే
ప్రొటోకాల్‌ను ప్రశ్నించిన జనసేన
నాయకులు


