శ్రీనృసింహ దీక్షలకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

శ్రీనృసింహ దీక్షలకు వేళాయె

Nov 21 2026 12:38 AM | Updated on Nov 21 2026 12:38 AM

● ఈ నెల 23 నుంచి మండల దీక్ష ● డిసెంబర్‌ 2 నుంచి 32 రోజుల దీక్ష ● వచ్చే ఏడాది జనవరి 2న దీక్షల విరమణ

సింహాచలం: శ్రీ నృసింహ దీక్షల సమయం ఆసన్నమైంది. వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దీక్షతో కొలిచే భక్తులకు ఆ విశేష పర్వదినాలు సమీపించాయి. ఈ నెల 23 నుంచి మండల దీక్ష, డిసెంబర్‌ 2 నుంచి 32 రోజుల దీక్ష ప్రారంభమవుతాయి. ఆయా రోజుల్లో దీక్షాధారులకు సింహగిరిపై దేవస్థానం వైదికులు ఉదయం 8 గంటలకు మాలధారణ చేస్తారు. వచ్చే ఏడాది జనవరి 2న ఈ రెండు దీక్షలు తీసుకున్న భక్తులంతా దీక్ష విరమించాల్సి ఉంటుంది. ఆరోజు స్వామివారి జన్మనక్షత్రం కావడంతో స్వాతి హోమం నిర్వహిస్తారు.

2015 నుంచి అధికారికంగా

శ్రీ నృసింహ దీక్షలు

స్వామిని ప్రత్యేక దీక్షతో కొలవాలని అడవివరానికి చెందిన కొందరు భక్తులు 24 ఏళ్ల క్రితం సంకల్పించారు. అప్పట్లో వీరంతా చందన దీక్షలుగా నామకరణం చేసి, ఒక పీఠంగా ఏర్పడి దీక్షలు ప్రారంభించారు. అలా ఏడాదికేడాది దీక్షాధారులు పెరుగుతూ వచ్చారు. పీఠాల సంఖ్య కూడా పెరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అల్లూరి జిల్లా ఏజెన్సీలోని గిరిజనులు కూడా పెద్ద సంఖ్యలో దీక్ష తీసుకోవడం ప్రారంభించారు. ఒడిశాలోని ఛత్రపురం, బరంపురం, గోపాలపురం తదితర ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు తెలంగాణకు చెందిన పలువురు భక్తులు దీక్షను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే చందన దీక్షలను అధికారికంగా నిర్వహించాలని దీక్షాధారులంతా సింహాచలం దేవస్థానం అధికారులను కోరారు. 2015లో చందన దీక్షలకు శ్రీ నృసింహ దీక్షలుగా నామకరణం చేసి సింహాచలం దేవస్థానం అధికారికంగా ప్రారంభించింది.

పీఠం ఏర్పాటు చేసే విధానం

దీక్షాధారులు స్వయంగా లేదా సామూహికంగా పవిత్ర ప్రదేశంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక పీటపై విష్వక్సేన భగవానుడు, నృసింహస్వామి, లక్ష్మీదేవి, గోదాదేవి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రాతఃకాలంలో సుప్రభాత సేవ నిర్వహించాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో విష్వక్సేన ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవి పూజ, నృసింహ అష్టోత్తరంతో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి పూజ చేయాలి. ధనుర్మాసం రోజుల్లో గోదాదేవిని కూడా పూజించాలి. పూజానంతరం స్వామివారి వైభవాన్ని కీర్తించి, రాత్రి పవళింపు సేవ నిర్వహించాలి.

దీక్ష నియమాలు

శ్రీ నృసింహ దీక్ష తీసుకునే భక్తులు చందనం రంగు వస్త్రాలు, నుదుటన తిరునామం ధరించాలి. బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదిలో గానీ, తటాకంలో గానీ, బావినీటితో గానీ స్నానం చేయాలి. బ్రహ్మచర్యం పాటించాలి.

తిరుముడి ద్రవ్యాలు

దీక్ష ముగింపు రోజున స్వామికి సమర్పించే ద్రవ్యాల మూటను దేవస్థానం అర్చకులు తిరుముడిగా పేర్కొన్నారు. కొబ్బరి కురిడీలు, చందనం చెక్క, పట్టువస్త్రం, ఆవు నెయ్యి, ముద్దకర్పూరం, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కుంకుమపువ్వు, పచ్చకర్పూరం, జీడిపప్పు, కిస్‌మిస్‌, పటికబెల్లంలను తిరుముడిగా కట్టుకుని స్వామికి సమర్పించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement