డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలకు శుక్రవారం సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆలయంలో ముహూర్తపు రాట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున రాట వేసి మార్గశిర మాసోత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంప్రదాయాన్ని అనుసరించి నాదస్వర మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ ఉదయం 9.35 గంటలకు శాస్త్రోక్తంగా రాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక మహిళా భక్తులు, ముత్తైదువులకు అమ్మవారి జాకెట్టు ముక్క, తాంబూలం, గాజులు, ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కె.శోభారాణి, కార్యనిర్వాహక ఇంజినీర్ బండారు రాంబాబు, సహాయ కార్యనిర్వహణాధికారి రాజు, పర్యవేక్షకుడు ఎంవీ రమణ, వేదపండితులు, ధర్మకర్తల మండలి ఛైర్మన్ కందుల నాగరాజు, ధర్మకర్తలు పాల్గొన్నారు.


