బీచ్‌రోడ్డు: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక చేయూతనందించేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా బ్యాంకు విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సిరిపురంలోని వైజాగ్‌పటం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ప్రత్యేక రుణ సహాయ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించింది. ఈ సందర్భంగా 39 మంది లబ్ధిదారులకు రూ.40 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆఫీస్ విశాఖపట్నం జేడీ ఆర్.సెంథిల్ కుమార్, ఎంఎస్‌ఎంఈ–కేవీఐసీ అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రమౌళి జగనం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ ఉమేష్ ఎన్.పొట్టి, చీఫ్ మేనేజర్ చల్లా కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి బ్యాంకు అందిస్తున్న వివిధ రకాల రుణ సదుపాయాలు, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, వ్యాపార విస్తరణకు అందుబాటులో ఉన్న ఆర్థిక సహకారంపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. ఎంఎస్‌ఎంఈ రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి అవకాశాల పెంపు, పారిశ్రామిక అభివృద్ధిలో ఈ రంగానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు బ్యాంకు అందిస్తున్న రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
39 మంది లబ్ధిదారులకు
రూ.40 కోట్ల రుణాల పంపిణీ


