బీచ్‌రోడ్డు: బీచ్ రోడ్డులో గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. దసపల్లా హిల్స్ మార్గంలోని ఎత్తు ప్రాంతంలో శుక్రవారం నిలిపి ఉంచిన హెచ్‌పీ గ్యాస్ సిలిండర్ల లోడు లారీ ఒక్కసారిగా అదుపుతప్పి కిందకు దూసుకొచ్చింది. గస్తీ నిర్వహిస్తున్న త్రీటౌన్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని, విద్యుత్ స్తంభాన్ని, రోడ్డుపై నిలిపి ఉన్న రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీస్ వాహనంలో ఉన్న ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ మహిళా హోంగార్డు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. అదష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై త్రీటౌన్ సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదన్నారు. గ్యాస్ లోడుతో ఉన్న లారీ అదుపుతప్పడంతో కొద్దిపాటి తేడా జరిగినా భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.


