వీఎంఆర్డీఏ నిబంధనలకు తిలోదకాలు
ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కుకు లేఅవుట్ ఫీజుల మినహాయింపు
ప్రభుత్వ ఖజానాకు రూ.1.56 కోట్ల గండి
గుర్రంపాలెంలో ఎంఎస్ఎంఈ లేఅవుట్ విషయంలో సర్కారు వింత వైఖరి
కుమార్ ఇన్ఫ్రాకు లబ్ధి చేకూర్చడంపై విమర్శలు
సాక్షి, విశాఖపట్నం: సామాన్యులు చిన్న ఇల్లు నిర్మించుకోవాలన్నా అన్ని రకాల పన్నులు, అనుమతి ఫీజులను ముక్కుపిండి వసూలు చేసే ప్రభుత్వం.. ప్రైవేట్ సంస్థల విషయానికి వచ్చేసరికి మాత్రం భారీ రాయితీలు ప్రకటిస్తోంది. పెందుర్తి మండలం గుర్రంపాలెంలో ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వాడ అభివృద్ధి పేరుతో ఓ సంస్థకు ఏకంగా రూ.1.56 కోట్ల మేర లేఅవుట్ అనుమతి ఫీజులను మినహాయిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనం. ఓవైపు నిధుల కొరతతో స్థానిక పట్టణాభివృద్ధి సంస్థ వీఎంఆర్డీఏ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఆ సంస్థకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టి ప్రైవేట్ సంస్థకు ప్రయోజనం చేకూర్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.1.56 కోట్ల ఫీజులకు మినహాయింపు
పెందుర్తి మండలం గుర్రంపాలెంలో 63.37 ఎకరాల విస్తీర్ణంలో ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేసేందుకు జె.కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పీపీపీ విధానంలో (మోడల్–1) రూ.237.71 కోట్ల పెట్టుబడి పెట్టడంతోపాటు 5 వేల మందికి ఉపాధి కల్పిస్తామంటూ ఆ సంస్థ ప్రతిపాదించడంతో ప్రభుత్వ ఆమోదం లభించింది. అయితే, నిబంధనల ప్రకారం ఈ భారీ లేఅవుట్‌కు సంబంధించి వీఎంఆర్డీఏకు రూ.1,56,43,600 అనుమతి ఫీజు చెల్లించాల్సి ఉంది. వీటితోపాటు రూ.15 వేల అప్లికేషన్ ఫీజు, రూ.5 వేల డీటీసీపీ యూజర్ ఛార్జీలు కలిపి మొత్తం రూ.1,56,63,600 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, జీవో నం.157ను ఆధారంగా చేసుకుని పారిశ్రామిక ప్రోత్సాహకాల పేరుతో ఈ మొత్తం ఫీజులను మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఖజానాకు ఇబ్బందులున్నా రాయితీలేనా?
స్థానిక సంస్థలు ఇప్పటికే నిధుల కొరతతో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ప్రైవేట్ సంస్థ కోసం ఏకంగా రూ.1.56 కోట్ల ఆదాయాన్ని వదులుకోవడం ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఈ ఫీజుల మినహాయింపు వల్ల పట్టణాభివృద్ధి సంస్థలు (యూడీఏలు), పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్బీలు) భారీగా ఆదాయం కోల్పోతాయని ప్రభుత్వమే జీవోలో పేర్కొనడం గమనార్హం. ప్రైవేట్ డెవలపర్లు ఈ భూముల్లో ప్లాట్లను అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా లాభాలు ఆర్జించే అవకాశం ఉండగా.. వారికి కల్పిస్తున్న రాయితీల వల్ల స్థానిక సంస్థలు మాత్రం ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఈ తరహా మినహాయింపులతో తమ ఆదాయానికి గండిపడుతుందని వీఎంఆర్డీఏ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గుర్రంపాలెం ఇండస్ట్రియల్ ఏరియా
దశలవారీ రీయింబర్స్మెంట్ సూచనలు బేఖాతరు!
ఫీజులను ముందుగానే మినహాయించే బదులు.. ప్రాజెక్టు పురోగతి, పూర్తిస్థాయిలో అమలు ఆధారంగా పరిశ్రమల శాఖ ద్వారా దశలవారీగా రీయింబర్స్మెంట్ రూపంలో రాయితీలు కల్పించాలని సంబంధిత శాఖాధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. తద్వారా స్థానిక సంస్థలు కోల్పోయే ఆదాయాన్ని పరిశ్రమల శాఖ నుంచి భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. అయినప్పటికీ ఈ సూచనలను పక్కనపెట్టి ముందుగానే ప్రైవేట్ సంస్థకు ఫీజుల మినహాయింపు కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల వీఎంఆర్డీఏ ఖజానాకు రావాల్సిన భారీ ఆదాయం చేజారిపోయిందని, ప్రైవేట్ సంస్థకు మాత్రం ప్రయోజనం చేకూరిందని అధికార వర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.


