చదువుదాం.. ఎదుగుదాం | - | Sakshi
Sakshi News home page

చదువుదాం.. ఎదుగుదాం

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

● 14 నుంచి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ● జిల్లా కేంద్ర గ్రంథాలయం, శాఖా గ్రంథాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

డాబాగార్డెన్స్‌: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, సాధారణ ప్రజలకు జ్ఞానాన్ని అందించే ముఖ్యమైన సంస్థలు. ఇవి సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి. వివిధ రకాల పుస్తకాలు, పత్రికలు, డిజిటల్‌ కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతాయి. ప్రజలను చైతన్యవంతులను చేయడంలోనూ, స్వాతంత్య్ర ఉద్యమాల సమయంలో గ్రంథాలయాలు కీలకపాత్ర పోషించాయి. ఈ నెల 14 నుంచి 20 వరకు 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్నాయి. జిల్లాలో వారం రోజుల పాటు పాఠశాల విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలతోపాటు కవి సమ్మేళనాలు, గ్రంథపాలకుల సదస్సులు, మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వారోత్సవాలు ఎందుకు జరుపుతారు..?

గ్రంథాలయోధ్యమ పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, వావిలాల గోపాలకృష్ణయ్య స్వాతంత్య్రం వచ్చాక జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించారు. పుస్తక పఠనం.. గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ వారోత్సవాలు జరుపుతారు. పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచడం, గ్రంథాలయాల వినియోగాన్ని ప్రోత్సహించడం, గ్రంథాలయ ఉద్యమకారుల సేవలు స్మరించుకోవడమే ప్రధాన ఉద్దేశం.

వారోత్సవ కార్యక్రమాల వివరాలు..

జగదాంబ జంక్షన్‌ మెలోడి థియేటర్‌ సమీపాన జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ నెల 14న శనివారం ఉదయం 9 గంటలకు వారోత్సవాలు ప్రారంభించనున్నారు. తొలిరోజున బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న గ్రంథాలయ ఉద్యమ ప్రముఖులపై ప్రసంగాలు, అవగాహన కార్యక్రమాలు, 17న రచయితల సందేశాలు, సెమినార్లు, సాహిత్య కార్యక్రమాలు, 18న విద్యార్థులకు వక్తృత్వం, వ్యాసరచన, క్విజ్‌, డ్రాయింగ్‌ పోటీలు, 19న మహిళా దినోత్సవం, 20న అక్షరాస్యత దినోత్సవం, వారోత్సవాల ముగింపు కార్యక్రమం, పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు.

అన్ని ప్రభుత్వ గ్రంథాలయాల్లో వారోత్సవాలు

రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ ఆదేశాల మేరకు జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖా గ్రంథాలయాల్లో వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం ఉమ్మడి విశాఖ జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాల నిర్వాహకులు, అధికారులతో ప్రత్యేక వెబినార్‌ నిర్వహించాం. చదివి నేర్చుకుందాం.. నాయకత్వాన్ని పెంపొందించుకుందాం.. పేరిట వారోత్సవాలు జరుపుతున్నాం.

–వన్నెంరెడ్డి సతీష్‌కుమార్‌, చైర్మన్‌,

జిల్లా గ్రంథాలయ సంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement