ద్వారకానగర్: అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుని, అధిక కమీషన్ల ఆశ చూపి, వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించి, వాటిని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తున్న ముఠాలపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఒక్కో బ్యాంకు ఖాతాకు రూ.10 వేల కమీషన్ ఇస్తామంటూ ఆకర్షించి, ఖాతాలతో పాటు ఏటీఎం కార్డులు, పాస్‌బుక్‌లు, సిమ్ కార్డులను సేకరిస్తున్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న హైదరాబాద్‌కు చెందిన ముడావత్ విజయ్‌కుమార్ అలియాస్ విశాల్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు మీడియాకు బుధవారం తెలిపిన వివరాలు..
విశాఖ నగరానికి చెందిన ఒక వ్యక్తిని వాట్సాప్ ద్వారా సంప్రదించిన విశాల్ అనే నిందితుడు, ఒక్కో బ్యాంకు ఖాతా అందిస్తే రూ.10 వేల చొప్పున కమీషన్ ఇస్తానని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు తనతో పాటు తన సోదరి పేరుతోనూ రెండు బ్యాంకు ఖాతాలు తెరిచి, వాటికి సంబంధించిన పాస్‌బుక్‌లు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు అందించాడు. అయితే ఆ ఖాతాలను సైబర్ నేరాల లావాదేవీలకు వాడుతున్నట్లు అనుమానం వచ్చి బాధితుడు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చిని ఆశ్రయించాడు. సీపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు చెందిన ముడావత్ విజయ్‌కుమార్(28)ను గుర్తించి అరెస్ట్ చేశారు. వివిధ వ్యక్తుల నుంచి కమీషన్ ప్రాతిపదికన బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, పాస్‌బుక్‌లు, సిమ్ కార్డులను సేకరించి సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అతని నుంచి రెండు మొబైల్ ఫోన్లు, వివిధ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన స్క్రీన్షాట్లను స్వాధీనం చేసుకున్నారు. కమీషన్ల ఆశతో తమ పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, పాస్‌బుక్‌లు, సిమ్ కార్డులను ఇతరులకు అప్పగించవద్దని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అరెస్ట్


