‘స్థానిక’ ఎన్నికల్లో కూటమి నేతల అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికల్లో కూటమి నేతల అక్రమాలు

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

● దొంగ ఓటు వేసిన ఎమ్మెల్యే పంచకర్లపై చర్యలకు డిమాండ్‌ ● నిరసన కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ నేతలు

బీచ్‌రోడ్డు: రాష్ట్రంలో కార్పొరేషన్‌, మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని సీపీఎం, సీపీఐ డిమాండ్‌ చేశాయి. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, రిగ్గింగ్‌, డబ్బుల పంపిణీకి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె.రెహమాన్‌ కోరారు. ఎన్నికల అక్రమాలను నిరసిస్తూ జీవీఎంసీ వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేస్తూ వాటిని కాలరాస్తోందన్నారు. అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేస్తారని చెప్పిన కూటమి ప్రభుత్వం, ఓటర్లకు డబ్బులు ఎందుకు పంచిందని ప్రశ్నించారు. పలుచోట్ల అభ్యర్థులను కిడ్నాప్‌ చేయడం, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని, ధనబలంతో ఎన్నికల్లో గెలవడం ప్రజాస్వామ్య విజయంగా భావించలేమన్నారు. పెందుర్తి జోన్‌ 115వ వార్డులో ఓటు హక్కు లేని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఎలా ఓటు వేశారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్‌, కలెక్టర్‌ విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రానున్న పంచాయతీ ఎన్నికలైనా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు బి.ఈశ్వరమ్మ, ఆర్‌.లక్ష్మణమూర్తి, నరేంద్ర, యూవీఎస్‌ఎన్‌.రాజు, ఎల్‌.జె.నాయుడు, సీపీఐ నాయకులు పి.పైడిరాజు, చంద్రశేఖర్‌, మన్మధరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement