పరికరాలున్నా..సిబ్బంది ఏరీ? | - | Sakshi
Sakshi News home page

పరికరాలున్నా..సిబ్బంది ఏరీ?

Nov 12 2026 12:31 AM | Updated on Nov 12 2026 12:31 AM

విమ్స్‌, ఛాతీ ఆస్పత్రుల్లో మూలనపడ్డ అత్యాధునిక వైద్య పరికరాలు

సీఎస్సార్‌ నిధులతో కొనుగోలు చేసినా సిబ్బందిలేక నిరుపయోగం

ప్రైవేటుకు వెళ్లలేక ఆర్థిక భారంతో అల్లాడుతున్న పేద రోగులు

ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్న అధికారుల నిర్లక్ష్యం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించడమంటే... రూ.కోట్లు వెచ్చించి యంత్రాలు కొనుగోలుచేసి మూలన పడేయడమేనంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే సీఎస్సార్‌ నిధులతో అత్యాధునిక పరికరాలు సమకూర్చుకున్నా, వాటిని నడిపించే దిక్కులేక విమ్స్‌, ఛాతీ ఆస్పత్రుల్లో విలువైన పరికరాలు మూలకు చేరాయి. దీంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రుల బాట పట్టాల్సి వస్తోంది. కొనడమే కాదు, వాటితో సేవలు అందించడం కూడా ప్రభుత్వ బాధ్యతేనన్న విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందని రోగులు, వారి బంధువుల ఆరోపణ.

బీచ్‌రోడ్డు: ఆస్పత్రికి అవసరమైన యంత్రాలు వచ్చాయి.. వాటిని అమర్చారు.. అందుబాటులో ఉంచారు.. కానీ వాటిని ఆపరేట్‌ చేసే సిబ్బందిని మాత్రం నియమించడం మరిచిపోయారు! దీంతో రూ.కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాలు అలంకారప్రాయంగా మారాయి. ప్రజాధనం, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్సార్‌) నిధులతో కొనుగోలు చేసిన యంత్రాలు రోగులకు ప్రాణప్రదంగా మారాల్సింది పోయి, వినియోగంలో లేక గదులకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్య సేవలు సిబ్బంది కొరత సాకుతో నిలిచిపోతున్నాయి. యంత్రాల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ.. వాటి వినియోగంపై అధికారులకు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విమ్స్‌లో మూలకు చేరిన డయాలసిస్‌ యూనిట్లు

విమ్స్‌ ఆస్పత్రికి సీఎస్సార్‌ నిధుల ద్వారా 10 డయాలసిస్‌ యూనిట్లు సమకూరాయి. వీటిని నిర్వహించే నెఫ్రాలజీ వైద్యులు, డయాలసిస్‌ టెక్నీషియన్లు లేకపోవడంతో ఆ యంత్రాలు ప్రారంభం నుంచీ నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఈ యూనిట్లు పూర్తిస్థాయిలో పనిచేస్తే రోజుకు సుమారు 30 మంది కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందేవి. ఇదే విభాగంలో ఇతర సిబ్బందిని ఇన్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించుకున్నట్లే, ఈ యంత్రాలకూ తక్షణమే సిబ్బందిని కేటాయించాలని రోగుల బంధువులు కోరుతున్నారు. అధికారుల కాలయాపన వల్ల కిడ్నీ రోగులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.

ఛాతీ ఆస్పత్రిలో స్లీప్‌ టెస్ట్‌ యంత్రం నిరుపయోగం

విశాఖ ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలోనూ ఇదే దుస్థితి నెలకొంది. గురక, స్లీప్‌ అప్నియా(నిద్రలో శ్వాస ఆగిపోవడం) వంటి సమస్యలను గుర్తించే ‘పాలిసోమ్నోగ్రఫీ’(స్లీప్‌ స్టడీ) యంత్రం టెక్నీషియన్లు లేక మూలనపడింది. రూ.లక్షల విలువైన ఈ యంత్రాన్ని వినియోగించకపోవడంతో అవసరమైన రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల బాట పట్టాల్సి వస్తోంది.

ప్రైవేటుకు వెళ్తే బాదుడే బాదుడు!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో, పేద, మధ్యతరగతి రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేటులో ఈ పరీక్షలు చేయించుకోవాలంటే సుమారు రూ.6 వేలు నుంచి రూ.10 వేలు వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. నిరుపేదలు ఈ వ్యయాన్ని భరించలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement