ఆ సమ్మిట్‌ కేవలం పబ్లిసిటీ కోసమే: గుడివాడ అమర్నాథ్ | Gudivada Amarnath Fires On Chandrababu about Partnership Summit | Sakshi
Sakshi News home page

ఆ సమ్మిట్‌ కేవలం పబ్లిసిటీ కోసమే: గుడివాడ అమర్నాథ్

Nov 12 2026 4:04 PM | Updated on Nov 12 2026 4:19 PM

Gudivada Amarnath Fires On Chandrababu about Partnership Summit

సాక్షి, తాడేపల్లి: విశాఖపట్నంలో నిర్వహించిన పార్టనర్‌షిప్ సమ్మిట్‌ కేవలం ప్రచారం కోసమేనని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ సమ్మిట్‌లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరూ పాల్గొనలేదని, రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాలేదని ఆరోపించారు. అంతేకాదు చంద్రబాబు వల్ల రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన జరగదని మరోసారి తేలిపోయిందన్నారు.

గతంలో నిర్వహించిన సమ్మిట్‌లలో చేసుకున్న ఒప్పందాలకు, వాస్తవంగా ప్రారంభమైన పరిశ్రమలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన విమర్శించారు. ఇలాంటి ఈవెంట్లు నిర్వహించడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని, ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేసుకోవడం చంద్రబాబు, లోకేశ్‌లకు అలవాటేనని అన్నారు.

గత రెండున్నరేళ్లలో చేసుకున్న ఒప్పందాలు, వాస్తవంగా ప్రారంభమైన పరిశ్రమల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయగలరా? 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి కల్పించారో వివరాలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పోర్టులను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కోర్టులకు వెళ్లారని, అయినప్పటికీ జగన్ సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టును ఒక కొలిక్కి తీసుకొచ్చారని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని కూడా జగన్ తీసుకొచ్చారని అన్నారు.

విశాఖలో 3 వేల ఎకరాల భూమిని ఊరూపేరు లేని కంపెనీలకు చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా పబ్లిసిటీ స్టంట్లను చంద్రబాబు ఆపాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో తీసుకొచ్చిన కంపెనీలకే చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా చంద్రబాబుకు పట్టడం లేదని అన్నారు. తుపాను వచ్చినా, కరువు వచ్చినా, సమ్మిట్‌లు నిర్వహించినా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లతో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.

ఇదీ చదవండి: డీలిమిటేషన్ బిల్లుపై కీలక అడుగు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement