గురుకులంలో కలకలం రేపుతున్న బాలికల జుట్టు కత్తిరింపు | Shocking Incident in Palnadu Gurukul School | Sakshi
Sakshi News home page

గురుకులంలో కలకలం రేపుతున్న బాలికల జుట్టు కత్తిరింపు

Nov 12 2026 1:51 PM | Updated on Nov 12 2026 1:52 PM

Shocking Incident in Palnadu Gurukul School

పల్నాడు జిల్లా: గురుకుల పాఠశాలలో బాలికల జుట్టు కత్తిరింపు వ్యవహారం కలకలం రేపుతోంది. సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఏపీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలలో ఐదు నుంచి ఇంటర్మీడియట్ వరకు 612 మంది బాలికలు విద్యనభ్యసిస్తూ వసతి పొందుతున్నారు. గురుకుల పాఠశాలలో సీసీ కెమెరాలు లేకపోవడం, రెగ్యులర్‌ ప్రిన్సిపల్‌ కూడా లేక పోవటంతో గురుకులం పర్యవేక్షణ కొరవడింది. 

ఈ క్రమంలో ఈ నెల 8న దీపావళి పర్వదినం జరుపుకొని విద్యార్థినిలు డార్మెంటరీలో నిద్రించేందుకు వెళ్లారు. 8వ తరగతి విద్యనభ్యసిస్తున్న 10 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించిన వ్యవహారం ఈ నెల 9న కలకలం రేపింది. దీనిపై గురుకుల పాఠశాల/ కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌ జి రజినికుమారి విద్యార్థినిలను విచారించగా చీకటిలో ఎవరు చేశారో చెప్పలేకపోయారు. తిరిగి ఈ నెల 9న అర్ధరాత్రి సమయంలో 7వ తరగతి విద్యనభ్యసిస్తున్న మరో 10 మంది విద్యార్థినిల జుట్టు కూడా కత్తిరించారు. దీనిపై ఈ నెల 10న సిబ్బంది అందరికీ సమావేశం నిర్వహించి ఎవరు కత్తిరించారనే అంశంపై రజినికుమారి చర్చించినప్పటికీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో విద్యార్థినిలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 

అంతేగాక సత్తెనపల్లి రూరల్‌ పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారాన్ని ఆమె చేరవేశారు. ఈ విషయాన్ని కొందరు బాలికలు వారి తల్లిదండ్రులకు తెలియజేయడంతో తల్లిదండ్రులు తమ బాలిక లను చూసేందుకు గురుకులం వద్దకు వచ్చి బాలికల జుట్టు కత్తిరించడం ఏమిటని? రాత్రి వేళ బయట వ్యక్తులు లోపలికి ఎలా రాగలుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినప్పటికీ తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని తల్లిదండ్రులు గురుకుల సిబ్బందిపై మండిపడ్డారు. విషయం తెలియడంతో సత్తెనపల్లి రూరల్‌ ఎస్‌ఐ ప్రవీణ్‌ వెళ్లి గురుకులంలోని విద్యార్థినిలతో వ్యక్తిగతంగా మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తానని తల్లిదండ్రులకు ఆయన తెలిపారు.  

భిన్నాభిప్రాయలు... 
రామకృష్ణాపురం బాలికల గురుకులంలో జుట్టు కత్తిరింపు వ్యవహారంలో ఎవరి పాత్ర ఏమిటనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలికల తల్లిదండ్రులు మాత్రం బయట నుంచి లోపలికి ప్రవేశించడం ఎలా సాధ్యమని, ఒకవేళ బయటి నుంచి ఎవరైనా ప్రవేశిస్తే పర్యవేక్షణ అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. కానీ గురుకులంలోని ఉపాధ్యాయినిలు మాత్రం ఇటీవల విద్యార్థినిలు అందరికీ ప్రభుత్వం నుంచి సరఫరా చేసిన స్టేషనరీ పంపిణీ చేయడం జరిగిందని, దానిలోని చాక్‌మార్‌తో ఆకతాయి తనంగా బాలికలే జుట్టు కత్తిరించుకున్నారనేది చెబుతున్నారు. బాలికలు ఆకతాయితనంతో జుట్టు కత్తిరించుకోవాల్సిన అవసరం ఏముంటుందని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. 

బాలికల గురుకులంలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడటంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కొందరు తల్లిదండ్రులు విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ జి రజినికుమారిని బుధవారం ఫోన్‌లో సంప్రదించగా ఆమె స్పందించలేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రామకృష్ణాపురంలోని బాలికల గురుకులంలో జుట్టు కత్తిరింపు వ్యవహరంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవటంతో పాటు గురుకులంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘావ్యవస్ధను పటిష్ట పరచటంతోపాటు భద్రత వైఫల్యం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలువురు విద్యార్థినిల తల్లిదండ్రులు కోరుతున్నారు.  

పునరావృతమైతే చర్యలు: ఆర్డీవో గోపాలకృష్ణ 
గురుకులంలో బాలికల జుట్టు కత్తిరింపు వ్యవహరంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రసార సాధనాల ద్వారా సమాచారం వ్యాప్తి కావటంతో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశాల మేరకు సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఏపీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.గోపాలకృష్ణ బుధవారం సందర్శించారు. గురుకులంలోని 7,8 తరగతుల విద్యార్థినుల జుట్టు కత్తిరింపు వ్యవహారంపై ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ రజనీకుమారితో మాట్లాడారు. బయటి నుంచి వ్యక్తులు లోపలికి రావడానికి అవకాశం లేదని, బాలికలే కత్తిరించుకున్నారని చెప్పారు.

 కత్తిరించిన బాలికలు ఎవరనేది తేలలేదన్నారు. దీనిపై ఇప్పటికే సత్తెనపల్లి రూరల్‌ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి కౌన్సెలింగ్‌ నిర్వహించడం జరిగిందన్నారు. ఆర్డీవో గోపాలకృష్ణ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా అని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా గతంలో సీసీ కెమెరాలు ఉన్నాయని, కోతులు పాడు చేయడంతో మళ్లీ కొత్తగా వాటిని ఏర్పాటు చేయలేదని ఆమె చెప్పారు. ఆర్టీవో మాట్లాడుతూ వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థినులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీవో చెప్పారు.  

గురుకులంలో డీసీఓ విచారణ
సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఏపీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో బాలికల జుట్టు కత్తిరింపు వ్యవహారంపై గురుకులాల జిల్లా కోఆర్డినేటర్‌ ఎస్‌ శ్రీదేవి బుధవారం గురుకులాన్ని సందర్శించారు. బాలికలకు నిర్దేశిత సమయం కేటాయించారు. జుట్టు కత్తిరించిన వ్యవహారంపై వివరాలు తెలిపారు. విద్యార్థినులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఏదో ఆకతాయితనంగా  విద్యార్థినులే జుట్టు కత్తిరించుకున్నట్టు నిర్ధారించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపనున్నట్లు ఆమె తెలిపారు. అంతేగాక త్వరితగతిన సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆమెతోపాటు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ జి.రజినికుమారి, ఉపాధ్యాయినులు, సిబ్బంది ఉన్నారు.  

ఇదీ చదవండి: కూటమి నుంచి బయట కొచ్చేస్తాం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement