ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో సందడి మరింత పెరగనుంది. త్వరలో సందర్శకులను అలరించేందుకు గుజరాత్ నుంచి నాలుగు రకాల వన్యప్రాణులు విశాఖ జూకు చేరాయి. జంతు మార్పిడి విధానంలో భాగంగా గుజరాత్‌లోని రాధేకృష్ణ టెంపుల్ వెల్ఫేర్ ట్రస్ట్‌తో జూ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా అక్కడి నుంచి నాలుగు రకాల జంతువులను తీసుకురాగా.. విశాఖ జూ నుంచి మూడు రకాల జంతువులను గుజరాత్‌కు తరలించారు. గుజరాత్ నుంచి వచ్చిన జంతువులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. ప్రస్తుతం వాటిని కొద్దిరోజులపాటు క్వారెంటైన్‌లో ఉంచుతామని, అనంతరం ఎన్‌క్లోజర్లలోకి తరలించి సందర్శకుల సందర్శనకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కొత్తగా వచ్చిన వాటిలో కాటన్ టాప్ టామరిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ జంతువులు ఇప్పటివరకు విశాఖ జూలో లేవని, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఆమె తెలిపారు.
ఇవీ కొత్త అతిథులు
గుజరాత్ నుంచి మూడు జీబ్రాలు (ఒక మగ, రెండు ఆడ), మూడు రెడ్ నెక్‌డ్ వాల్లబీలు (ఒక మగ, రెండు ఆడ), నాలుగు కాటన్ టాప్ టామరిన్లు (రెండు మగ, రెండు ఆడ), రెండు కామన్ మార్మోసెట్లు (ఒక మగ, ఒక ఆడ) తీసుకొచ్చారు. వాటికి బదులుగా విశాఖ జూ నుంచి మూడు ఇండియన్ గార్లు (ఒక మగ, రెండు ఆడ), నాలుగు స్టంప్ టైల్డ్ మకాక్స్ (రెండు మగ, రెండు ఆడ), రెండు ఘరియల్స్ (ఒక మగ, ఒక ఆడ) గుజరాత్‌కు తరలించారు.


