కమిషనర్ మారినా..
తమవారికి పనులు అప్పగించేందుకేనా?
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ మ్యూజియంల నిర్వహణ బాధ్యతలను సంబంధిత రంగంలో అనుభవం ఉన్న సంస్థలకు మాత్రమే అప్పగించారు. పనులను విడివిడిగా విభజించి టెండర్లు ఆహ్వానించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా.. కురుసుర సబ్‌మైరెన్ మ్యూజియం, కల్వరి ఫిన్, టీయూ–142 మ్యూజియం, సీ హ్యారియర్ ఎయిర్‌క్రాఫ్ట్, యుహెచ్–3హెచ్ మ్యూజియంల నిర్వహణకు ఒకే టెండర్‌ను ఆహ్వానించారు. దీనికి తోడు కాంట్రాక్టు సంస్థకు రూ.1.50 కోట్ల టర్నోవర్ ఉండాలని, రూ.75 లక్షల విలువైన ‘సింగిల్ వర్క్’ చేసిన అనుభవం తప్పనిసరి అని పేర్కొన్నారు. గత రెండేళ్లలో హౌస్‌కీపింగ్ పనులు చేసి ఉండాలనే షరతునూ విధించారు. అంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌస్‌కీపింగ్ పనుల్లో ఉన్న సంస్థలకే ఈ మ్యూజియంల నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా నిబంధనలు రూపొందించారన్న ఆరోపణలకు ఈ షరతులు బలం చేకూరుస్తున్నాయి. సాధారణంగా రూ.కోటి లోపు విలువైన హౌస్‌కీపింగ్, మెయింటెనెన్స్ పనులకు ఇలాంటి ‘సింగిల్ వర్క్’ నిబంధన విధించడం అరుదు. మొత్తం పనులను ఒకే సంస్థకు అప్పగించాలనే ఉద్దేశంతోనే ఈ షరతులను రూపొందించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
కమిషనర్ మారినా.. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ)లో టెండర్ల వ్యవహారం మారడం లేదు. గతంలో వివాదాస్పదమైన నిబంధనలతో పిలిచిన టెండర్లను రద్దు చేసినా.. ఇప్పుడు అవే షరతులతో మళ్లీ టెండర్లు ఆహ్వానించడం అధికారుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది.
సబ్‌మైరెన్, యుద్ధ విమానాలు, మ్యూజియంల నిర్వహణకు సంబంధించి ‘సాక్షి’ జూన్, జూలై నెలల్లో వరుస కథనాలు ప్రచురించడంతో అప్పటి కమిషనర్ టెండర్లను రద్దు చేశారు. కమిషనర్ బదిలీతో కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ అదే నిబంధనలతో ప్రక్రియ మొదలైంది.
అనుభవానికి మంగళం
బీచ్‌రోడ్డులో కొలువుదీరిన సబ్‌మైరెన్, యుద్ధ విమాన మ్యూజియంలు విశాఖకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దేశ సాహసోపేత చరిత్రను విద్యార్థులు, పర్యాటకులకు పరిచయం చేస్తున్న వీటి నిర్వహణలో సాంకేతిక నైపుణ్యం అత్యంత కీలకం. గతంలో టెండర్ నిబంధనల్లోనూ దీనికే ప్రాధాన్యం ఉండేది. యుద్ధ విమానాలు, సబ్‌మైరెన్లు, మ్యూజియంల నిర్వహణలో అనుభవం ఉన్న సంస్థలకే అర్హత కల్పించేవారు. ఇప్పుడు మాత్రం ఆ షరతును పక్కనపెట్టి.. కేవలం హౌస్‌కీపింగ్ పనులు చేసిన అనుభవం ఉంటే సరిపోతుందనే నిబంధనను తీసుకొచ్చారు. ఇదే అంశంపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్పటి కమిషనర్ టెండర్లను రద్దు చేశారు. తాజాగా మళ్లీ అదే అర్హతను కొనసాగిస్తూ టెండర్లకు ఆహ్వానం పలకడం గమనార్హం.
‘వీఎంఆర్‌డీఏ డెక్’లోనూ అవే షరతులు
‘వీఎంఆర్‌డీఏ డెక్’ నిర్వహణ టెండర్‌లోనూ ఇదే తరహా నిబంధనలు కనిపిస్తున్నాయి. మ్యూజియంల నిర్వహణకు పెట్టిన షరతులతోనే పోలిన అర్హతలను ఇక్కడా చేర్చడం.. ఒకే సంస్థకు అనుకూలంగా టెండర్ ప్రక్రియను రూపొందిస్తున్నారన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గతంలో వివాదాస్పద నిబంధనలతో పిలిచిన టెండర్లను రద్దు చేసినా.. కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత వాటినే మళ్లీ అమలు చేయడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కీలకమైన మ్యూజియంల నిర్వహణ విషయంలో నాణ్యత, సాంకేతిక అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా హౌస్‌కీపింగ్ అనుభవాన్ని ప్రామాణికంగా తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ ప్రక్రియలో పోటీని పెంచాల్సిన అధికారులు.. ప్రత్యేక నిబంధనలతో పోటీని పరిమితం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వీఎంఆర్‌డీఏ టెండర్లలో
కొనసాగుతున్న అడ్డగోలు పర్వం
యుద్ధ విమానాల టెండర్లపై వీడని బెట్టు
తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు
మళ్లీ అవే నిబంధనలు
గతంలో టెండర్లు రద్దు చేసిన కమిషనర్
కమిషనర్ బదిలీ అయినా..
అవే కండిషన్లతో మళ్లీ టెండర్లు


