పల్లె కళలకు పట్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

పల్లె కళలకు పట్టాభిషేకం

Aug 26 2026 1:42 AM | Updated on Aug 26 2026 1:42 AM

బీచ్‌ రోడ్డు: అంతర్జాతీయ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని అభయ్‌ ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో సిరిపురంలోని వుడా చిల్డ్రన్స్‌ ఎరినాలో ఆంధ్రప్రదేశ్‌ జానపద కళా వైభవం–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 35 ప్రసిద్ధ జానపద కళారూపాల బృందాలు, సుమారు 700 మంది కళాకారులను అభినందన పురస్కారాలు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా జానపద కళారూపాలకు సంబంధించిన ప్రత్యేక వెబ్‌సైట్‌, సావనీర్‌ను ప్రముఖులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు, పద్మభూషణ్‌ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జీవీ రామచంద్రరావు, ఎస్‌ఆర్‌కేపీ గ్రూప్‌ చైర్మన్‌ ఎం.ఎస్‌.ఎన్‌. రాజు, సీనియర్‌ జర్నలిస్ట్‌ వీవీ రమణమూర్తి, తెలుగు పౌరాణిక పద్యనాటక కళాశారది మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. కళారంగానికి విశేష సేవలందించిన పలువురు ప్రముఖులను నిర్వాహకులు ప్రత్యేక పురస్కారాలతో సత్కరించారు.కార్యక్రమానికి హాజరైన సుమారు 700 మంది జానపద కళాకారులకు జీవీ రామచంద్రరావు భోజన సదుపాయాలు కల్పించారు. కళాకారుల పట్ల ఆయన చూపిన ఔదార్యాన్ని అతిథులు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రాచీన జానపద కళలను పరిరక్షిస్తున్న కళాకారులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అండగా నిలుస్తానని తెలిపారు. ఈసందర్భంగా జీవీ రామచంద్రరావును అతిథులు సత్కరించారు. బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్టీ చెరువు రామకోటయ్య చీఫ్‌ కన్వీనర్‌గా, మేడా మస్తాన్‌రెడ్డి ఆహ్వాన కమిటీ తరఫున వ్యవహరించారు. ధనుంజయ్‌–అభయ్‌ ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల కళాకారులు ప్రదర్శించిన జానపద సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అలరించిన జానపద వైభవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement