బీచ్‌రోడ్డు: మరణం ఎప్పుడూ విషాదాన్నే మిగుల్చుతుంది.. కానీ ఆ మరణంలోనూ మరొకరికి ఆయువు పోయవచ్చని నిరూపిస్తూ నగరానికి చెందిన ఒక కుటుంబం మహోన్నత ఆదర్శాన్ని చాటింది. పుట్టెడు దుఃఖంలోనూ సమాజం పట్ల బాధ్యతను మరవకుండా, బ్రెయిన్ డెడ్ అయిన భర్త అవయవాలను దానం చేసి మరొకరి జీవితంలో వెలుగులు నింపారు ఓ వైద్యురాలు.
గుండెకోతలోనూ ఆదర్శ నిర్ణయం
నగరానికి చెందిన మడక జనార్ధనమూర్తి (50) తీవ్రమైన మెదడు రక్తస్రావంతో (బ్రెయిన్ హెమరేజ్) రామ్‌నగర్‌లోని ఎంజీఎం సెవెన్ హిల్స్ ఆస్పపత్రిలో చేరారు. అత్యవసర వైద్య బృందం ఎంత శ్రమించినా ఫలితం దక్కకపోవడంతో, వైద్య ప్రమాణాల ప్రకారం ఆయనను ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించారు. భర్త ఇక లేరన్న వార్త ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. అయితే విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆస్పత్రిలో దంత వైద్య నిపుణురాలిగా సేవలందిస్తున్న ఆయన భార్య డాక్టర్ ఆర్. మహాలక్ష్మి, ఆ తీవ్ర విషాదంలోనూ ధైర్యం పూని మానవత్వాన్ని చాటుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి భర్త అవయవ దానానికి అంగీకరించారు.
జీవన్‌దాన్ ద్వారా పునర్జన్మ: ‘జీవన్‌దాన్ ఆంధ్రప్రదేశ్’ అవయవ మార్పిడి కార్యక్రమం ద్వారా ఆయన కాలేయాన్ని (లివర్) స్వీకరించిన వైద్యులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొక రోగికి అమర్చి నూతన జీవితాన్ని ప్రసాదించారు. దేహం వీడినా మరొకరి రూపంలో తన భర్త జీవించే ఉంటారనే ఆ తల్లి ఆవేదన, ఆశయం అక్కడి ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి.
అధికారిక లాంఛనాలతో శ్రద్ధాంజలి
అవయవ దానం ద్వారా సమాజానికి గొప్ప సందేశాన్ని ఇచ్చిన దాత జనార్ధనమూర్తి పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికింది. ఎంజీఎం సెవెన్ హిల్స్ ఆస్పత్రి ప్రాంగణంలో పోలీ సు బ్యాండ్ మేళంతో గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో జీవన్‌దాన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ డాక్టర్ మన్మథరావు, విశాఖ పోర్ట్ ట్రస్ట్ సీఎంవో డాక్టర్ ఉషాదేవి, ఏసీపీ లక్ష్మణమూర్తి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్. మాధవ్, ఆస్పత్రి యాజమాన్యం, వైద్య బృందం పాల్గొని దాతకు పుష్పాంజలి ఘటించారు.


