విశాఖ విద్య: జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్) ద్వారా విద్యార్థులను సామాజిక సేవా కార్యక్రమాల్లో మరింతగా భాగస్వామ్యం చేయాలని ఎన్‌ఎస్‌ఎస్ ఏపీ, తెలంగాణ రీజినల్ డైరెక్టర్ ఆర్.సైదానాయక్ పిలుపునిచ్చారు. ఏయూలోని ఎన్‌ఎస్‌ఎస్ సెమినార్ హాల్లో ఆదివారం నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. ప్రోగ్రాం అధికారులు ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డి.సింహాచలం మాట్లాడుతూ.. ప్రోగ్రాం అధికారులు వలంటీర్లను పూర్వ గణతంత్ర దినోత్సవ శిబిరాలకు సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ విశాఖ జిల్లా నోడల్ అధికారి ఈపీఎస్ భాగ్యలక్ష్మి, సీనియర్ ప్రోగ్రాం అధికారులు వై.అనసూయదేవి, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ పల్లవి, డాక్టర్ హరిబాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రీజినల్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సైదానాయక్‌ను ఘనంగా సత్కరించారు.


