మహారాణిపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం నిర్వహణలో నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? కేజీహెచ్‌లో చోటుచేసుకున్న తాజా పరిణామం ఈ ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చింది. క్లినికల్ స్పెషాలిటీ విభాగాలకు చెందిన వైద్యులను ఎన్టీఆర్ వైద్యసేవ ఇన్‌చార్జి మెడికల్ కోఆర్డినేటర్ (మెడ్కో)గా నియమించవద్దని వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ న్యూరోసర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. శివరామకృష్ణకు మెడ్కో బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదంగా మారింది.
ఉత్తర్వుల నేపథ్యం
కేజీహెచ్‌కు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఏ. రాజేష్‌ను ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్‌కు డిప్యుటేషన్‌పై పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ట్రస్ట్ మెడ్‌కు పూర్తి బాధ్యతలను డాక్టర్ కె. శివరామకృష్ణకు అప్పగించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యంత రద్దీగా ఉండే న్యూరోసర్జరీ విభాగంలో పనిచేసే వైద్యుడికి ఈ అదనపు పరిపాలనా బాధ్యత అప్పగించడంపై ఆస్పత్రి వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డీఎంఈ ఆదేశాలు బేఖాతరు
ఎన్టీఆర్ వైద్యసేవ/ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ బాధ్యతలను సీఎస్‌ఆర్‌ఎంవో, డీసీఎస్‌ఆర్‌ఎంవో, ఆర్‌ఎంవో వంటి పరిపాలనా వైద్యాధికారులకే అప్పగించాలని, క్లినికల్ స్పెషాలిటీ వైద్యులను వీలైనంత వరకూ ఈ బాధ్యతల నుంచి మినహాయించి వారి సేవలను పూర్తిగా రోగుల చికిత్సకే వినియోగించాలని డీఎంఈ గతంలోనే స్పష్టం చేసినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. క్లినికల్ వైద్యులు ఇన్‌చార్జిలుగా ఉంటే పథకం అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు తలెత్తుతాయని, పరిపాలనా వ్యవహారాలతో ప్రత్యక్ష సంబంధమున్న సీఎస్‌ఆర్‌ఎంవో, డీసీఎస్‌ఆర్‌ఎంవో, ఆర్‌ఎంవోలే ఈ బాధ్యతలకు సరైనవారని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నట్టు సమాచారం. అయితే వీటిని పక్కనపెట్టి న్యూరోసర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్‌కు బాధ్యతలు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది.
వద్దన్నా వినకుండా అప్పగింత
మెడ్కో బాధ్యతలు స్వీకరించలేనని సంబంధిత వైద్యుడు చెప్పినప్పటికీ బలవంతంగా అప్పగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం శస్త్రచికిత్సలు, రోగుల పరీక్షలతో బిజీగా ఉండే న్యూరోసర్జరీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్యుడిపై ఇంత విస్తృత పరిపాలనా భారం మోపడం రోగుల సేవలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎంఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నతాధికారుల ఉద్దేశమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
డైట్ క్యాంటీన్‌లోనూ అదే తీరు
కేజీహెచ్‌లో డైట్ క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను కూడా ఆర్‌ఎంవో స్థాయి అధికారులకు కాకుండా పీడియాట్రిక్స్ విభాగ అధిపతి డాక్టర్ చక్రవర్తికి అప్పగించినట్టు ఆస్పత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి. క్లినికల్ బాధ్యతలు నిర్వర్తించే స్పెషలిటీ వైద్యులపై పరిపాలనా భారం మోపడం వైద్య సేవలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆర్‌ఎంవో వ్యవస్థ ఉన్నా
వినియోగించని వైనం
కేజీహెచ్‌లో సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ యు. శ్రీహరి, డీసీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ కుమార్, ఆర్‌ఎంవో డాక్టర్ బంగారయ్య వంటి పరిపాలనా వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ, కీలక బాధ్యతల నుంచి వారిని పక్కనపెట్టడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. బాధ్యతలు నిర్వహించే అధికారులను పక్కనపెట్టి, ఉన్నతాధికారులు చెప్పినట్లు సంతకాలు పెట్టే రబ్బర్ స్టాంపుల కోసమేనా నిబంధనలను సైతం విస్మరిస్తున్నారు? అన్న ప్రశ్నలు ఆస్పత్రి వర్గాల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి.
కలెక్టర్ జోక్యం చేసుకోవాలి
డీఎంఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ నిర్వహణలో నిబంధనలు పాటిస్తున్నారా? క్లినికల్ స్పెషాలిటీ వైద్యుడికి మెడ్కో బాధ్యతలు అప్పగించడం సమంజసమేనా? అందుబాటులో ఉన్న ఆర్‌ఎంవో వ్యవస్థను ఎందుకు వినియోగించలేదు? అన్న ప్రశ్నలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.నిబంధనలు కేవలం సాధారణ ఉద్యోగులకే వర్తిస్తాయా, ఉన్నతాధికారులకు వర్తించవా అన్న ప్రశ్నకు కేజీహెచ్ యాజమాన్యం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


