న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026
నేడు విశాఖకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
మరింత
అల్లిపురం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ శుక్ర, శనివారాలు విశాఖలో పర్యటించనున్నారు. శుక్రవారం విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి రాత్రి 9.40కి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి విశాఖలోని నోవోటెల్ హోటల్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. శనివారం ఉదయం 9.15 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4.45 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో న్యూఢిల్లీకి బయలుదేరుతారు.
హైకోర్టు న్యాయమూర్తి జయసూర్య రాక
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య కూడా శుక్రవారం విశాఖకు రానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుని నోవోటెల్ హోటల్‌కు వెళ్తారు. శనివారం ఉదయం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 7.20కి గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌కు పయనమవుతారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు కూటమి నేతలు మరో అడుగు ముందుకేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డేటా సెంటర్లు, టూరిజం ప్రాజెక్టులు, మైనింగ్ పేరుతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కొండలను తొలిచేస్తున్న పరిస్థితుల్లో.. ఇప్పుడు లేటరైట్ పేరుతో సరుగుడు ప్రాంతంలో తవ్వకాలను మరింత భారీగా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉత్పత్తి లక్ష్యాన్ని రెట్టింపు చేసి ఏడాదికి 22 లక్షల టన్నుల లేటరైట్ తవ్వేందుకు అనుమతులు పొందేందుకు కసరత్తు సాగుతోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు 9న సుందరకోట గ్రామంలోని కొత్త సిరిపురం రామాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ప్రకటించింది. జర్తా లక్ష్మణరావు పేరుతో కొనసాగుతున్న మైనింగ్ ప్రాజెక్టులో 121 హెక్టార్ల విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న 10 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని 22 లక్షల టన్నులకు పెంచాలని ప్రతిపాదించారు. మరో 36 హెక్టార్లలో కొత్తగా మైనింగ్‌కు అనుమతులు పొందేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
రెట్టింపు తవ్వకాలు !
నాతవరం మండలం సరుగుడు పంచాయతీ పరిధిలో ఇప్పటికే 130.5 హెక్టార్లలోని రెండు ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల నుంచి ఏడాదికి సుమారు 20 లక్షల టన్నుల లేటరైట్‌ను తరలిస్తున్నారు. దీనికి అదనంగా మరో 20 లక్షల టన్నులను వెలికితీసేలా అనుమతులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మొత్తం ఏడాదికి 40 లక్షల టన్నుల లేటరైట్ తవ్వి తరలించే స్థాయికి మైనింగ్‌ను విస్తరించేందుకు పావులు కదుపుతున్నారన్నమాట. ఇప్పటికే సరుగుడు పంచాయతీలోని నాగులకొండపై జరుగుతున్న తవ్వకాలపైనా ఆరోపణలు ఉన్నాయి. సుమారు 60 అడుగుల మేర తవ్వకాలకు అనుమతి ఉండగా.. 100 అడుగుల లోతు వరకు తవ్వకాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో భూగర్భ జలాల మట్టం పడిపోవడం, తాగునీటి ఇబ్బందులు తలెత్తడంతోపాటు వంట చెరకుకూ కొరత ఏర్పడుతోందని చుట్టుపక్కల ఉన్న పది గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండలు తరిగిపోతున్నా.. అధికారుల పర్యవేక్షణ మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైగ్రేడ్ లేటరైట్‌కు డిమాండ్
సరుగుడు ప్రాంతంలో లభిస్తున్న హైగ్రేడ్ లేటరైట్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని సమాచారం. టన్నుకు సుమారు రూ.5 వేల వరకు ధర పలుకుతున్న ఈ ఖనిజాన్ని ఒడిశాలోని ఓ ప్రైవేటు స్టీల్ ప్లాంట్‌కు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. రోజుకు వందలాది ట్రిప్పుల్లో ఖనిజాన్ని తరలించేందుకు అటవీ ప్రాంతం మీదుగా ప్రత్యేక రహదారిని నిర్మించినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రహదారి నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఉన్నాయా? అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. అటవీ భూమిలో రహదారి నిర్మాణం జరిగినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గిరిజనుల పేరుతో మైనింగ్
సరుగుడు పంచాయతీ పరిధి గిరిజన ప్రాంతం కావడంతో ఇక్కడ 1/70 చట్టం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో గిరిజనుల పేర్లను ముందుపెట్టి మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గిరిజనుల పేర్లపై అనుమతులు తీసుకుంటున్నప్పటికీ.. వాస్తవంగా తవ్వకాలు, ఖనిజ రవాణా వ్యవహారాలను ఎవరు నియంత్రిస్తున్నారు? అసలు లబ్ధిదారులు ఎవరు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానికంగా కీలక నేత కుమారుడు ‘చినబాబు’ తరఫున కీలక పాత్ర పోషిస్తున్నారనే ప్రచారం ఉంది. తాజాగా చినబాబుకు సన్నిహితంగా ఉండే మరో ఎంపీకి కూడా ఈ మైనింగ్ వ్యవహారంలో వాటా అందుతోందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇప్పటికే తవ్వకాలతో సరుగుడు కొండలు రూపురేఖలు కోల్పోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతుండగా.. ఉత్పత్తిని రెట్టింపు చేసి ఏటా 22 లక్షల టన్నుల లేటరైట్ వెలికితీసేందుకు అనుమతిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది.
ఏటా 22 లక్షల టన్నుల లేటరైట్ తవ్వకానికి ప్లాన్
అనకాపల్లి జిల్లా సరుగుడులో మరింత ప్రకృతి విధ్వంసం
సుందరకోటలో సెప్టెంబరు 9న ప్రజాభిప్రాయ సేకరణ
చినబాబుకు, ఇద్దరు ఎంపీలకు భారీగా ముడుపులు
చినబాబుకు రూ. 200 కోట్లు!
ఈ మైనింగ్ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన కీలక నేతలకు భారీగా వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి తరలించే ప్రతి టన్ను లేటరైట్‌కు ‘చినబాబు’ పేరుతో రూ.500, మరో ఇద్దరు ఎంపీలకు చెరో రూ.250 చొప్పున వాటా వెళ్తోందని ప్రచారం జరుగుతోంది. ఏడాదికి 40 లక్షల టన్నుల లేటరైట్ తరలింపు లక్ష్యాన్ని చేరుకుంటే.. టన్నుకు రూ.500 చొప్పున లెక్కించినా ‘చినబాబు’కు ఏడాదికి రూ.200 కోట్ల వాటా అందుతుందనే ప్రచారం సాగుతోంది. మరో ఇద్దరు ఎంపీలకు చెరో రూ.100 కోట్ల చొప్పున.. ఇద్దరికీ కలిపి మరో రూ.200 కోట్లు దక్కుతాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి కేవలం ప్రతిపాదిత ఉత్పత్తి లక్ష్యాల ఆధారంగా వేసిన లెక్కలేనని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అధికారిక లెక్కలకు మించి ఖనిజాన్ని తరలిస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందనే ఆరోపణలూ ఉన్నాయి.


