శ్రావణ శోభ | - | Sakshi
Sakshi News home page

శ్రావణ శోభ

Aug 21 2026 7:27 AM | Updated on Aug 21 2026 7:27 AM

● పూజా సామగ్రి కొనుగోళ్లతో కిటకిటలాడిన మార్కెట్లు ● పూలు, పండ్ల ధరలకు రెక్కలు

డాబాగార్డెన్స్‌: శ్రావణ మాసం రెండో శుక్రవారం.. వరలక్ష్మీ దేవి వ్రతం సందర్భంగా నగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. అమ్మవారి ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలంకరణలతో వెలిగిపోతున్నాయి. దీంతో ఎటు చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు.

కిటకిటలాడుతున్న మార్కెట్లు

వరలక్ష్మీ వ్రతానికి అవసరమైన పూలు, పండ్లు, పూజా సామగ్రి కొనుగోళ్లతో నగరంలోని ప్రధాన మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గురువారం ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో మార్కెట్లకు తరలివచ్చారు. పూర్ణామార్కెట్‌, అక్కయ్యపాలెం, ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక తదితర ప్రాంతాల్లోని మార్కెట్లు

కొనుగోలుదారులతో రద్దీగా మారాయి.

అమాంతం పెరిగిన ధరలు

వ్రతం సందర్భంగా పూలు, పండ్లకు డిమాండ్‌ పెరగడంతో ధరలు అమాంతం పెరిగాయి. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా పూల దిగుబడి తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. ఆపిల్‌ కిలో రూ.250 నుంచి రూ.300, దానిమ్మ రూ.200 నుంచి రూ.250, అరటిపండ్లు డజన్‌ రూ.80 నుంచి రూ.120 వరకు ఉన్నాయి. పూల ధరలు మరింత ఎగబాకాయి. మల్లెపూలు కిలో రూ.600 నుంచి రూ.800 వరకు విక్రయించగా.. కనకాంబరం కిలో రూ.3 వేల నుంచి రూ.4,500 వరకు పలికింది. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన తామరపువ్వుకు కూడా భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఒక్క పువ్వు రూ.50 నుంచి రూ.100 వరకు విక్రయించారు. చామంతులు, బంతి పువ్వులు కూడా కిలో రూ.400 నుంచి రూ.600 వరకు ఉన్నాయి.

అమ్మవారిపై భక్తితో..

ధరలు పెరిగినా కొనుగోళ్ల విషయంలో మహిళలు వెనుకడుగు వేయలేదు. వరలక్ష్మీదేవి వ్రతాన్ని వైభవంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో పూలు, పండ్లు, పూజా సామగ్రిని ఉత్సాహంగా కొనుగోలు చేశారు. మొత్తంగా శ్రావణ శుక్రవారం ముందురోజే నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయాల అలంకరణలు, మార్కెట్ల సందడి, మహిళల కొనుగోళ్లతో విశాఖ నగరం వరలక్ష్మీదేవి పండుగ శోభతో కళకళలాడుతోంది.

కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న పూర్ణామార్కెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement