మహారాణిపేట: ఈ నెల 22, 23 తేదీల్లో విశాఖలో జరగనున్న బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. విదేశీ అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, వసతి, ప్రోటోకాల్ ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. 22న ఉదయం తొట్లకొండలో బ్రిక్స్ క్రీడా మంత్రుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తొట్లకొండ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన మొక్కలను అటవీ శాఖ అధికారులు గుర్తించి, నాటాలని సూచించారు. అనంతరం రాడిసన్ బ్లూలో ద్వైపాక్షిక సమావేశాలు, యువజన వ్యవహారాలకు సంబంధించి ఇతర సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే రోజు సాయంత్రం నోవాటెల్‌లో విదేశీ క్రీడా మంత్రులతో సమావేశం, గాలా డిన్నర్‌లో ముఖ్యమంత్రి పాల్గొననున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. 23న రుషికొండ బీచ్‌లో విదేశీ అతిథులకు డిన్నర్ ఏర్పాటు చేయాలని సూచించారు. విశాఖ, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, థింసా నృత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమాల ప్రాంతాల్లో పారిశుధ్యం, సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమీక్షలో శాప్ ఎండీ భరణి, డీసీపీ మణికంఠ, డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని
కలెక్టర్ ఆదేశం


