పోలీస్‌ ఇంటికే కన్నం.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ఇంటికే కన్నం.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

Aug 21 2026 7:27 AM | Updated on Aug 21 2026 7:27 AM

23.5 తులాల బంగారు ఆభరణాల స్వాధీనం

23.5 తులాల బంగారు ఆభరణాల స్వాధీనం

అల్లిపురం: పోలీసుల ఇంటికే కన్నం వేసిన ఓ అంతర్రాష్ట్ర దొంగను టూటౌన్‌ క్రైమ్‌ పోలీసులు గంటల వ్యవధిలోనే కటకటాల్లోకి నెట్టారు. తాళం వేసిన ఇళ్లను రెక్కీ చేసి చోరీలకు పాల్పడుతున్న ఘరానా నేరస్థుడు షరీఫ్‌ షేక్‌(45)ను అరెస్ట్‌ చేశారు. గురువారం నగర పోలీస్‌ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రైమ్‌ డీసీపీ కె.లతామాధురి కేసు వివరాలు వెల్లడించారు.

రెండున్నర గంటల్లోనే దోచేశాడు!

అల్లిపురం పోలీస్‌ క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ బండారు ముత్యాల నాయుడు గత బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి ఓ శుభకార్యానికి వెళ్లారు. రెండున్నర గంటల వ్యవధిలో వారు తిరిగి వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బెడ్‌రూమ్‌లోని బీరువా లాకర్‌ను ధ్వంసం చేసి 23.5 తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు గుర్తించి వెంటనే టూటౌన్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీ కెమెరాలతో..

పోలీస్‌ క్వార్టర్స్‌లోనే చోరీ జరగడంతో రంగంలోకి దిగిన దర్యాప్తు బృందం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించింది. అనుమానితుడి కదలికలను గుర్తించి, పక్కా సమాచారంతో కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి చోరీకి గురైన 23.5 తులా ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

నగరానికి వచ్చి రెక్కీ..

నిందితుడు షరీఫ్‌ షేక్‌ ఈ నెల 13న విశాఖకు చేరుకుని అల్లిపురం, పరిసర ప్రాంతాల్లో రోజూ రెక్కీ నిర్వహించేవాడని డీసీపీ తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పట్టపగలే చోరీలకు పాల్పడటం అతడి నైజమన్నారు. అతడిపై గతంలో మహారాష్ట్రలోని నవీ ముంబై, తుర్బే, నేరుల్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనూ, హైదరాబాద్‌లోని గాంధీనగర్‌ పీఎస్‌ పరిధిలోనూ పలు గృహదొంగతనాల కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు. కేసును అత్యంత వేగంగా ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేసిన టూటౌన్‌ క్రైమ్‌ పోలీసులను నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement