10వ రోజుకు చేరుకున్న
జూనియర్ వైద్యుల సమ్మె
ఇప్పటి వరకు స్పందించని ప్రభుత్వం
రోగులకు ప్రభుత్వాస్పత్రుల్లో
అందని వైద్యం
మహారాణిపేట: జూనియర్ వైద్యుల సమ్మె పేద రోగుల పాలిట శాపంగా పరిణమించింది. స్టైఫండ్, ఇతర సమస్యల పరిష్కారానికి జూడాలు చేస్తున్న సమ్మె 10వ రోజుకు చేరుకుంది. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. ఫలితంగా పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు జూడాల సమస్యలపై దృష్టి సారించి సమ్మెను విరమింపజేసే చర్యలు తీసుకోవడం లేదు.
కేజీహెచ్‌లో పెరిగిన రోగులు
కేజీహెచ్‌లో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నప్పటికీ.. రోగుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. గురువారం కేజీహెచ్ అత్యవసర వార్డులో రోగుల రద్దీ పెరగడంతో ఒకే మంచంపై ఇద్దరు చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. విధుల్లో ఉన్న నర్సులే వారికి వైద్య సేవలు అందించారు.
మంత్రుల వైఖరిపై అసంతృప్తి
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు గురువారం ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి సెంట్రల్ పార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సెంట్రల్ పార్కు వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో 102 మంది జూనియర్ వైద్యులు రక్తదానం చేశారు. మరోవైపు ఎనిమిది మంది జూడాలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
వెనక్కి తగ్గేదే లేదు
తమ నిరసన రోగులకు వ్యతిరేకం కాదని, రోగుల ప్రాణ సంరక్షణ తమ బాధ్యత అని జూనియర్ వైద్యుల సంఘం నాయకుడు దినకర్ సాయి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (ఏపీజూడా) నాయకుడు డాక్టర్ శిరాజ్ తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సత్యజీత్, మనోహర్, దినకర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.


