90 శాతం వైకల్యం.. పింఛన్ మాత్రం దూరం
మహారాణిపేట: పుట్టుకతోనే దివ్యాంగురాలైన బాలికకు దివ్యాంగ పింఛన్ మంజూరు చేయాలని ఆమె కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో బాలిక తండ్రి షేక్ హామాజ్ వినతిపత్రం సమర్పించారు. అయితే ప్రస్తుతం కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం లేదని అధికారులు తెలియజేయడంతో కుటుంబ సభ్యులు నిరాశ చెందారు. పెదవాల్తేర్‌కు చెందిన తొమ్మిదేళ్ల షేక్ ఫజిల్లా పుట్టుకతోనే మూగ, చెవిటి దివ్యాంగురాలు. సదరం ధ్రువీకరణ పత్రంలో 90 శాతం వైకల్యం నమోదైనప్పటికీ ఇప్పటి వరకు పింఛన్ మంజూరు కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల బాలిక తల్లి షేక్ దిల్షా మృతి చెందడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చిన్నచిన్న పనులు చేసి జీవనం సాగించే తండ్రి బాలిక సంరక్షణ కోసం పనులకు వెళ్లలేకపోతున్నాడని, ప్రస్తుతం అమ్మమ్మకు వచ్చే నెలకు రూ.4 వేల పింఛన్‌పైనే కుటుంబం ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు.


