బీచ్‌రోడ్డు: విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) అభివృద్ధితో ఆర్థిక, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని నీతి ఆయోగ్ సభ్యుడు ఆర్.బాలసుబ్రహ్మణ్యం ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో వీఈఆర్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఈఆర్ పరిధిలో పర్యాటకులను ఆకర్షించే ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, తద్వారా పర్యాటక రంగంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే భారీగా పెట్టుబడులు రావడంతో పలు పరిశ్రమల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ప్రచారం
రాష్ట్ర పర్యాటక రంగానికి బ్రాండ్ ఇమేజ్ పెంచేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. పురాతన సంపదను పరిరక్షించడంతో పాటు దివ్యాంగులు సహా అన్ని వర్గాలకు అనుకూలమైన మౌలిక వసతులు కల్పించాలని, నీటి ఆధారిత వినోద కార్యక్రమాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. వీఈఆర్ సీఈవో యువరాజ్.. వీఈఆర్‌లో భాగంగా విశాఖ బే సిటీ అభివృద్ధి, తీర ప్రాంతంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై వివరించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పట్టణ మౌలిక వసతులు, భూగర్భ డ్రైనేజీ, సీబీడీ అభివృద్ధి, మురికివాడల పునరాభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, ప్రతిపాదిత మెట్రో రైల్ ప్రాజెక్టు తదితర అంశాలను తెలియజేశారు. జిల్లా పర్యాటకాభివృద్ధి అధికారి మాధవీలత ఏపీ హోమ్‌స్టే పథకానికి లభిస్తున్న ఆదరణను ప్రస్తావించారు. అనంతరం ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్, పరిశ్రమలు, పోర్టులు, హోటళ్లు, బ్యాంకింగ్, సీ ఫుడ్, ఉక్కు, ఫార్మా తదితర రంగాల ప్రతినిధులతో సమావేశమై పెట్టుబడులు, అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై చర్చించారు.


