మహారాణిపేట: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి ఈ వారం 41 వినతులు అందాయి. విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో వినియోగదారులు లో–వోల్టేజ్, విద్యుత్ లైన్ల మార్పు, విద్యుత్ బిల్లులు, రూఫ్‌టాప్ సోలార్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు తదితర సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. అందిన వినతులను సంస్థ సీఎండీ పృథ్వితేజ్ ఇమ్మడి పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబర్ 9493681912కు సందేశం పంపడం ద్వారా కూడా తమ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చని ఏపీఈపీడీసీఎల్ తెలిపింది. కార్యక్రమంలో డైరెక్టర్లు టీవీ సూర్యప్రకాష్, సీజీఎం పి. సోల్మన్ రాజు, జనరల్ మేనేజర్లు ఎం. ఝాన్సీ, వీవీఎస్‌ఎన్‌వీ ప్రసాద్, వీవీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


