మహారాణిపేట: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో సరైన అవగాహన పెంపొందించడం ద్వారానే వ్యాధి వ్యాప్తిని అరికట్టడం సాధ్యమవుతుందని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రూపొందించిన హెచ్‌ఐవీ/ఎయిడ్స్ అవగాహన ప్రచార పత్రాలు, ఆరోగ్య కరదీపిక పుస్తకాన్ని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జేసీ జి.విద్యాధరి, అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భధారణకు ముందు దంపతులు హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడం, పరస్పర విశ్వాసంతో జీవించడం, వాడిన సూదులు, సిరంజీలను ఇతరులతో పంచుకోకుండా ఉండడం, అవసరమైనప్పుడు సురక్షిత రక్తాన్నే వినియోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ చట్టం–2017 ప్రకారం హెచ్‌ఐవీతో జీవిస్తున్న వ్యక్తులపై వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని, సమానత్వ భావనతో వ్యవహరించాలన్నారు. అవసరమైన సమాచారం, సలహాల కోసం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 1097ను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నరేంద్ర సింగ్, ఏడీసీ సత్యవేణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


