అల్లిపురం : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జీవీఎంసీకి సంబంధించిన మొత్తం 126 వినతులు అందినట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. వీటిలో పట్టణ ప్రణాళిక విభాగానికి 65, ఇంజినీరింగ్‌కు 24, రెవెన్యూకు 12, ప్రజారోగ్యానికి 9, ఇతర విభాగాలకు చెందిన వినతులు ఉన్నాయి. ప్రతి ఫిర్యాదును అదే రోజు పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే పురమిత్ర, పీజీఆర్‌ఎస్‌లో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. జోనల్ కమిషనర్లు, అధికారులు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.


