న్యాయమైన డిమాండ్లపై తక్షణం స్పందించాలి లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదు ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి
డాబాగార్డెన్స్: ఉపాధ్యాయులు, ప్రభుత్వ విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి హెచ్చరించారు. ఆదివారం డాబాగార్డెన్స్‌లో ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షురాలు పి.పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు, మధ్యంతర భృతి ప్రకటన, పెండింగ్ బకాయిల విడుదల, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై వివిధ యాప్‌ల నిర్వహణ, సర్వేల పేరుతో పెరిగిన బోధనేతర పనుల భారాన్ని తగ్గించి, విద్యాబోధనకే పరిమితం చేయాలని ఏఐఎస్‌టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి జోసెఫ్ సుధీర్‌బాబు, నాయకులు కోరారు. పాఠశాలల్లో ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. సమస్యలపై స్పందించకపోతే అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని ఐక్య పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పైడిరాజు, అనకాపల్లి జిల్లా నాయకులు ఐవీ రామిరెడ్డి, పరదేశి, వరహాల దొర తదితరులు పాల్గొన్నారు.


