మహారాణిపేట: ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఆదివారం ఆర్.కె.బీచ్ నుంచి వైఎంసీఏ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ సెల్ ఆధ్వర్యంలో ర్యాలీతో పాటు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఏనుగుల ప్రాధాన్యంపై పాఠశాల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సహకారంతో విశాఖ వ్యాలీ స్కూల్‌లో పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో జూనియర్ (6–8 తరగతులు), సీనియర్ (9–12 తరగతులు) విభాగాల్లో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు ఈ నెల 13న జరిగే కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నారు. కార్యక్రమంలో నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ డైరెక్టర్ జనరల్ నాజ్ రిజ్వీ, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (సీసీఎఫ్) ఐకేవీ రాజు, జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్ర ధామా, విశాఖ జూ క్యూరేటర్ మంగమ్మ, విశాఖ వ్యాలీ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఈశ్వరి ప్రభాకర్, శాస్త్రవేత్త డాక్టర్ సీఆర్ మగేష్ తదితరులు పాల్గొన్నారు.


