వాంతులు, విరేచనాలతో
బాధపడుతున్న 50 మంది విద్యార్థులు
వార్డెన్, ఇద్దరు మెస్ సిబ్బంది కూడా
ఆస్పత్రిలో చేరిక
ఆహారం, నీటి నమూనాలు సేకరించిన
అధికారులు
ఆనందపురం: మండలంలోని బోయపాలెంలోని శశి ఇంటర్మీడియట్ క్యాంపస్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజులుగా సుమారు 50 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. వీరిలో 23 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. విద్యార్థులతో పాటు ఒక వార్డెన్, ఇద్దరు మెస్ సిబ్బంది నగరంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులందరూ కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. విద్యార్థులను వారి ఇళ్లకు పంపించి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు, డీపీఎంవో డాక్టర్ ఉమావతి, ఆనందపురం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ షేక్ షబీనా భాను కళాశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల అస్వస్థతకు ఆహారం వికటించడమా, లేక తాగునీరు కలుషితం కావడమా అనే అంశంపై దర్యాప్తు చేపట్టామని డీఎంహెచ్‌వో తెలిపారు. ఇందుకోసం ఆహారం, నీటి నమూనాలను సేకరించి ప్రాంతీయ ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీ నాటికి ల్యాబ్ నివేదిక వచ్చే అవకాశం ఉందని, అప్పుడే అస్వస్థతకు గల అసలు కారణం వెల్లడవుతుందని తెలిపారు. ప్రస్తుతం కళాశాల ప్రాంగణంలో 24 గంటల పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.


