సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్ కుటుంబం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కొనియాడారు. శుక్రవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు చిక్కా సత్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకే రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘నేతన్న నేస్తం’ వంటి సంక్షేమ పథకాన్ని అమలు చేసి వేలాది కుటుంబాలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారని పేర్కొన్నారు. భారతదేశానికి చేనేత రంగం గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టిందని, చేనేత కళాకారుల నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని కొనియాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పద్మశాలి సామాజిక వర్గానికి పార్లమెంట్, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ల స్థాయిల్లో విస్తృత అవకాశాలు కల్పించామని గుర్తుచేశారు. కార్పొరేషన్‌లో కో–ఆప్షన్ సభ్యురాలిగా కొప్పుల ప్రభావతికి అవకాశం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కార్యక్రమంలో పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, చేనేత విభాగం నాయకులు వానపల్లి ఈశ్వర్‌రావు, సూరిశెట్టి సూరిబాబు, యిద్దలపు వేంకటేశ్వర్లు, నీలి రవి, హేమలత, పి.ఈశ్వరి, గాదె రాజు, కాకి పద్మ, కొయ్యపాక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


