ఉక్కు గుండె! | - | Sakshi
Sakshi News home page

ఉక్కు గుండె!

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

కరగని
గత 16 నెలల్లో రూ.36,363 కోట్ల ఆదాయం అత్యవసర నిధిగా రూ.903 కోట్లు నిల్వ బ్యాంకు ఖాతాల్లో రూ.195 కోట్ల నగదు నెలవారీ వేతన భారం రూ.55 కోట్లు తగ్గినా.. జీతాల చెల్లింపుల్లో జాప్యం ఉద్యోగులు జీతాలు, వీఆర్‌ఎస్‌, వితంతువుల పెన్షన్లు కలిపి రూ.590 కోట్లకు పైగా బకాయిలు

కోట్లున్నా..

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది విశాఖ ఉక్కు యాజమాన్యం తీరు. గత 16 నెలల్లో రూ.36,363 కోట్ల ఆదాయం ఆర్జించినా.. ఉక్కు కార్మికులకు మాత్రం ’జీతాల గండం’ తప్పడం లేదు. ఖజానాలో కోట్లాది రూపాయలు నిల్వ ఉన్నా.. ఉద్యోగుల జీతాలు, వీఆర్‌ఎస్‌ బకాయిలు, వితంతువుల పెన్షన్లు కలిపి రూ.590 కోట్లకు పైగా చెల్లింపులు పెండింగ్‌లోనే ఉన్నాయి. యాజమాన్యపు నిర్దయపై శ్రామికలోకం భగ్గుమంటోంది.

సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం: ఉక్కును కరిగించే కొలిమి మండుతోంది.. కానీ యాజమాన్యం మనసు మాత్రం కరగడం లేదు. వేల కోట్ల ఆదాయం కళ్లముందే ఉన్నా.. రాత్రింబవళ్లు చెమటోడ్చి సంస్థను నిలబెడుతున్న ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వాలనే బాధ్యత మాత్రం కనిపించడం లేదు. సంస్థ ఖాతాల్లో కోట్లాది రూపాయలు నిల్వ ఉన్నా.. ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన వారి హక్కులు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఇవ్వాల్సిన వితంతు పెన్షన్లను సైతం నిలిపివేయడం ఉక్కు యాజమాన్యం అమానవీయ వైఖరికి అద్దం పడుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ వైపు నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యల మధ్య.. యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగుల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు వేలాది కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించి ఉత్పత్తి భారాన్ని కొద్దిమందిపై మోపింది. మరోవైపు ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గడంతో నెలవారీ వేతన వ్యయం గణనీయంగా తగ్గినా.. ఆ ప్రయోజనాన్ని ఉద్యోగులకు అందించకుండా జీతాల చెల్లింపులనే ఆలస్యం చేస్తోంది. ఇదే సమయంలో ‘స్టీల్‌ప్లాంట్‌ను మేమే కాపాడాం’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న అధికార పార్టీ నేతలు.. ప్లాంట్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న దుస్థితిపై మాత్రం నోరు మెదపడం లేదు. వేల కోట్ల ఆదాయం వస్తున్న సంస్థలో జీతాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? చట్టబద్ధమైన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు.

వేల కోట్ల ఆదాయం

స్టీల్‌ప్లాంట్‌ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.27,032 కోట్ల అమ్మకాల ద్వారా ఆదాయం ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జూలై వరకు మరో రూ.9,331 కోట్లు సమకూరాయి. అంటే కేవలం 16 నెలల్లోనే రూ.36,363 కోట్ల ఆదాయం నమోదైంది. అంతేకాదు అత్యవసర పరిస్థితుల కోసం రూ.903 కోట్లను ప్రత్యేక నిధిగా పక్కన పెట్టింది. బ్యాంకు ఖాతాల్లో మరో రూ.195 కోట్ల నగదు నిల్వ ఉన్నట్లు సమాచారం. డబ్బు లేదనే వాదనకు ఈ గణాంకాలే సమాధానం చెబుతున్నాయి.

వేతన భారం తగ్గినా..!

గత ఏడాది ఫిబ్రవరిలో ప్లాంట్‌లో 12,249 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారి నెలవారీ వేతన వ్యయం రూ.195 కోట్లు. వీఆర్‌ఎస్‌లు, పదవీ విరమణలు, రాజీనామాల కారణంగా ఈ ఏడాది జూలై నాటికి ఉద్యోగుల సంఖ్య 8,498కు పడిపోయింది. దాంతో నెలవారీ జీతాల భారం రూ.140 కోట్లకు తగ్గింది. అంటే ప్రతి నెలా యాజమాన్యానికి రూ.55 కోట్ల మేర ఆదా అవుతోంది. వేతనభారం తగ్గిన తర్వాత కూడా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకపోవడం ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. డబ్బు లేక కాదు.. డబ్బు ఉండి కూడా జీతాలు నిలిపివేస్తున్నారనే అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

బకాయిల చిట్టా

జీతాలు ఇవ్వకపోగా, చట్టబద్ధంగా చెల్లించాల్సిన బకాయిలను సైతం పెండింగ్‌లో పెట్టి రిటైర్డ్‌ ఉద్యోగులను, బాధిత కుటుంబాలను నడిరోడ్డున పడేసింది.

బకాయి రకం పెండింగ్‌

E§øÅ-VýS$ÌS ò³…yìl…VŠæ i™éË$ -₹383.71 Mør$Ï

ç³§ýlÒ ÑÆý‡Ð]l$׿ "ÎÐŒæ Ô>ÌSÈ'- ₹117.00 Mør$Ï

ÒB-ÆŠ‡-G-‹Ü&2 ºM>-Ƈ$$-Ë$- -₹58.78 Mør$Ï

ÒB-ÆŠ‡-G-‹Ü&3 ºM>-Ƈ$$-Ë$ -₹14.46 Mør$Ï

Ñ™èl…-™èl$-Ð]l#ÌS ò³¯]lÛ¯]l$Ï ₹16.75 Mør$Ï

మొత్తం రూ.590 కోట్లు

నిల్వ నిధులు

ఏమవుతున్నాయి?

16 నెలల్లో రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం.. రూ.903 కోట్ల అత్యవసర నిధి.. రూ.195 కోట్ల నగదు నిల్వలు.. నెలకు రూ.55 కోట్ల వేతనభారం తగ్గింపు.. అయినా ఉద్యోగుల జీతాలు, వీఆర్‌ఎస్‌ బకాయిలు, రిటైర్మెంట్‌ ప్రయోజనాలు, వితంతువుల పెన్షన్లు ఎందుకు నిలిచిపోయాయి? ఈ నిధులు ఎక్కడ వినియోగిస్తున్నారు? ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కులను ఎంతకాలం వాయిదా వేస్తారు? వేలాది కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే ఈ నిర్ణయాలకు బాధ్యత ఎవరు వహిస్తారు? స్టీల్‌ప్లాంట్‌ను తామే కాపాడామని చెప్పుకుంటున్న అధికార పక్ష ప్రజాప్రతినిధులు ఇప్పుడు అయినా స్పందిస్తారా? ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారా? లేక ప్రకటనలకే పరిమితమవుతారా? అన్నది ఉక్కు కుటుంబాలు ఎదురు చూస్తున్న ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement