ఒక మలుపు.. రెండు ప్రాణాలు | - | Sakshi
Sakshi News home page

ఒక మలుపు.. రెండు ప్రాణాలు

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

● బీచ్‌ రోడ్డులో ఘోర ప్రమాదం ● కారు ఆకస్మిక మలుపుతో బైక్‌ ఢీకొని విషాదం ● ఇద్దరి దుర్మరణం, మరొకరికి గాయాలు

కొమ్మాది: ఆ పేద కుటుంబంలో పిల్లలను ప్రయోజకులను చేయాలన్న ఆ తల్లి ఆశలు బీచ్‌రోడ్డు ప్రమాదంలో చిధ్రమయ్యాయి. స్నేహితులను కలిసి సంతోషంగా ఊరికి తిరుగుపయనమైన యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కారు డ్రైవర్‌ చేసిన తప్పు.. రెండు కుటుంబాల్లో కోలుకోలేని విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా జామికి చెందిన ఎం.పుష్పారావు, గ్రంధి సూరి (22) బుధవారం ఉదయం విశాఖలోని మిత్రులను కలిసేందుకు వచ్చారు. రోజంతా సరదాగా గడిపి, సాయంత్రం బైక్‌పై స్వగ్రామానికి తిరుగుపయనమయ్యారు.

కారు డ్రైవర్‌ నిర్లక్ష్యంతో..

బీచ్‌రోడ్డు మీదుగా వెళ్తుండగా తిమ్మాపురం జంక్షన్‌ వద్ద నగరం వైపు నుంచి వస్తున్న రాజమండ్రికి చెందిన నాగేశ్వరరావు కారును ఒక్కసారిగా ఎడమవైపునకు తిప్పేశాడు. దాంతో వెనుక నుంచి వస్తున్న బైక్‌ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టి, అక్కడే ఉన్న సీసీ కెమెరా స్తంభాన్ని, ఆపై రోడ్డు దాటేందుకు నిలబడి ఉన్న కాసరపు కృష్ణవేణిపైకి దూసుకుపోయింది. ఈ దారుణ ఘటనలో బైక్‌ వెనుక కూర్చున్న యువకుడు సూరి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బైక్‌ నడుపుతున్న పుష్పారావు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

పిల్లల చదువుల కోసం వెళ్తూ..

జీవీఎంసీ 4వ వార్డు పరిధిలోని తిమ్మాపురంకు చెందిన కాసరపు కృష్ణవేణి (43) దిగువ మధ్యతరగతి గృహిణి. భర్త ధనరాజు క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. కొడుకు చాణుక్య ఐటీఐ, కూతురు మీనాక్షి 8వ తరగతి చదువుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా పిల్లలను గొప్పగా చదివించుకోవాలన్న ఆరాటంతో కృష్ణవేణి రుషికొండలోని ఒక హోటల్‌లో పనికి వెళుతున్నారు. బుధవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మృత్యువు బైక్‌ రూపంలో కబళించింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కన్నుమూసింది. అమ్మ లేదని తెలిసి ఆ పిల్లలు కన్నీరుమున్నీరవుతున్న తీరు స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదానికి రాజమండ్రికి చెందిన కారు డ్రైవర్‌ నాగేశ్వరరావు అతివేగం, నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై లీలాదిత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాయాలతో పుష్పారావు, ప్రమాదానికి గురైన బైక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement