నాడు పి.వి.సింధు అకాడమీకి వ్యతిరేకంగా ధర్నా నేడు అదే కార్యక్రమంలో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం టీడీపీ నేత ఒమ్మి సన్యాసిరావు యూటర్న్‌పై స్థానికంగా జోరుగా చర్చ
ఆరిలోవ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో మూడు ఎకరాల స్థలాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పి.వి.సింధుకు కేటాయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నవంబర్ 7న పి.వి.సింధు తన తల్లిదండ్రులతో కలిసి అదే స్థలంలో భూమిపూజ నిర్వహించారు. అయితే, ఆ సమయంలో స్థల కేటాయింపును రద్దు చేసి జూనియర్ కళాశాలకు ఇవ్వాలని కోరుతూ టీడీపీ మాజీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒమ్మి సన్యాసిరావు స్థానిక టీడీపీ, బీజేపీ, సీపీఐ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. దీంతో పి.వి.సింధు పోలీసులను ఆశ్రయించగా భూమిపూజ కార్యక్రమం పోలీసు బందోబస్తుతో జరిగింది. ఇదే స్థలంలో బుధవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేత పి.వి.సింధు మరోసారి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాకకు ఒమ్మి సన్యాసిరావు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా, తన అనుచరులతో కలిసి ఘన స్వాగతం పలికి పూలు చల్లారు. కార్యక్రమం ముగిసే వరకు అక్కడే ఉన్నారు. గతంలో ఇదే స్థల కేటాయింపును వ్యతిరేకించిన ఒమ్మి సన్యాసిరావు ఇప్పుడు అదే ప్రాజెక్టుకు స్వాగతం పలకడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అప్పట్లో జూనియర్ కళాశాల కోసం ఉద్యమించిన వారు, ఇప్పుడు అదే స్థలంలో అకాడమీ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, గతంలో ఈ నిరసన వెనుక తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రోత్సాహం ఉందన్న ఆరోపణలు వినిపించగా, ఇప్పుడు ఆయన కూడా మంత్రి లోకేష్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.


