మూడు ముక్కలవ్వనున్న విశాఖ జెడ్పీ
ఉద్యోగుల నుంచి ఆప్షన్ల ఆహ్వానం
15 రోజుల్లో కొత్త జిల్లా పరిషత్తులకు కేటాయింపులు
ప్రతి జెడ్పీకి 65 మంది,ప్రతి ఎంపీపీకి 13 మంది సిబ్బంది
మహారాణిపేట: సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖపట్నం జిల్లా పరిషత్ త్వరలోనే మూడు ముక్కలు కానుంది. గతంలో చేపట్టిన ఉమ్మడి జిల్లాల పునర్విభజన ఆధారంగా విశాఖ జెడ్పీని మూడు కొత్త జిల్లా పరిషత్తులుగా విభజిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) అమల్లోకి రావడంతో.. సెప్టెంబర్ 25 తర్వాత విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల స్థాయిల్లో అధికారుల సంఖ్యను ఖరారు చేయడంతో పాటు, సీనియారిటీ ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం చేశారు.
సుదీర్ఘ చరిత్రకు ముగింపు
విశాఖ జిల్లా పరిషత్‌కు విశిష్టమైన చరిత్ర ఉంది. 1959లో సమితులు, తాలూకాలు, జిల్లా బ్లాక్ బోర్డుల ఆధారంగా జిల్లా పరిషత్ వ్యవస్థ ఆవిర్భవించింది. అనంతరం 1983లో మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల వ్యవస్థకు రూపుదిద్దుకోగా, 1986 నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. 2021 సెప్టెంబర్ 25న జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జె.సుభద్ర చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని పాలకవర్గం పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 24తో ముగియనుంది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌కు తెరపడనుండగా.. మూడు కొత్త జిల్లా పరిషత్తులు అధికారికంగా ఏర్పాటుకానున్నాయి.
జిల్లాల విభజనతో కొత్త జెడ్పీలు
2022లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాను విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా విభజించారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. అయితే అప్పట్లో జిల్లా పరిషత్తుల విభజన జరగలేదు. ఇప్పుడు ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో జెడ్పీల విభజన ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో కొత్త జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, అధికారులు, కార్యాలయాల విభజనకు ప్రభుత్వం నిష్పత్తులను ఖరారు చేసింది.
ఉద్యోగుల కేటాయింపుపై కసరత్తు
ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్‌లో ప్రస్తుతం 63 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పడే ప్రతి జిల్లా పరిషత్‌లో 65 మంది చొప్పున అధికారులు, సిబ్బంది ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అలాగే ప్రతి మండల పరిషత్ కార్యాలయంలో 13 మంది సిబ్బంది ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీని కోసం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్, మండల పరిషత్తులు, పాఠశాలలు, వసతి గృహాలు తదితర పంచాయతీరాజ్ సంస్థల్లో కలిపి మొత్తం 876 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 39 మండల పరిషత్తులు ఉన్నాయి. ప్రతి మండలంలో ఒక ఎంపీడీవో, ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది, డ్రైవర్లు, నైట్ వాచ్‌మెన్లు తదితర ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.
సీనియారిటీ జాబితాల తయారీ
జిల్లా పరిషత్, మండల పరిషత్తులు, ఇతర పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సీనియారిటీ జాబితాల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు అనుగుణంగా ఉద్యోగి విధుల్లో చేరిన తేదీ, అర్హతలు, కేడర్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సీనియారిటీ జాబితాలను రూపొందిస్తున్నారు. ఈ జాబితాల ఆధారంగానే కొత్త జిల్లా పరిషత్తులకు ఉద్యోగుల కేటాయింపులు, బదిలీలు చేపట్టనున్నారు. రానున్న 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.


