బాధ్యత మరిచి.. ఆగ్రహంతో ఊగి! | - | Sakshi
Sakshi News home page

బాధ్యత మరిచి.. ఆగ్రహంతో ఊగి!

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

విజ్ఞప్తి చేసేందుకు వెళ్లిన అధ్యాపకులపై ఏయూ వీసీ తీవ్ర ఆగ్రహం?

‘కోర్టుకు వెళ్లారా.. మీ విన్నపం వినేదే లేదు’ అంటూ రుసరుసలు

ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని

బాధితుల ఆవేదన

కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేయాలని నిర్ణయం

విశాఖవిద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మూడేళ్లకు పైగా సేవలందిస్తున్న సుమారు 25 మంది అడ్జంక్ట్‌, అడ్‌హాక్‌ అధ్యాపకుల పట్ల వర్సిటీ ఉపకులపతి అత్యంత దారుణంగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. ముందస్తు సమాచారం లేదా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమను విధుల నుంచి తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ అధ్యాపకులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. వారికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో తమ విజ్ఞప్తులను వీసీకి సమర్పించి, పరిస్థితిని వివరించేందుకు వెళ్లిన అధ్యాపక బృందానికి వైస్‌ ఛాన్సలర్‌ చాంబర్‌లో చేదు అనుభవం ఎదురైంది. అధ్యాపకుల పట్ల వీసీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ, అత్యంత అవమానకరంగా మాట్లాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యాయం అడిగితే నిందలా?

‘కోర్టును ఆశ్రయించడంతో మీ సమస్యను వినే ఉద్దేశం గానీ, పరిగణనలోకి తీసుకునే ఆలోచన గానీ నాకు లేదు’ అని వీసీ తెగేసి చెప్పినట్లు సమాచారం. ‘విజిలెన్స్‌ విభాగం మీ జీతాలను తిరిగి వసూలు చేయాలని సూచిస్తోందని, మీలో ఎవరికీ సరిగా బోధించే సామర్థ్యం లేదు’ అని వ్యాఖ్యానించినట్లు అధ్యాపకులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. గతంలో తమ సమస్యను చెప్పుకోవడానికి పలుమార్లు కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వకపోవడం వల్లే తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా అరుస్తూ దుర్భాషలాడారని ఆరోపిస్తున్నారు. అర్హతలు, సరైన నియామక ప్రక్రియ ద్వారా ఎంపికై న తమను విధుల నుంచి తొలగించి, వారి స్థానంలో గంటల వేతన ప్రాతిపదికన కొత్తవారిని తీసుకోవడానికి ప్రయత్నించడం ఏమాత్రం తగదని స్పష్టం చేశారు.

దళిత అధ్యాపకులకు తీవ్ర అవమానం

ఈ భేటీ సందర్భంగా షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన కొంతమంది అధ్యాపకులను పేరుపేరునా ప్రస్తావిస్తూ తీవ్రంగా అవమానించినట్లు తెలుస్తోంది. విక్టర్‌, విజయ్‌కుమార్‌ అనే అధ్యాపకులు పరిస్థితిని వివరించడానికి ముందుకు రాగా.. ‘మీ కుటుంబాలు ఇబ్బందులు పడితే పడనివ్వండి, మిమ్మల్ని వర్సిటీలో చేరమని ఎవరు చెప్పారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు’ అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడినట్లు బాధితులు వాపోయారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా దళిత అధ్యాపకులను చిన్నచూపు చూస్తూ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు.

అధ్యాపకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే

వైస్‌ ఛాన్సలర్‌ తీరు తీవ్ర మనోవేదనను కలిగించింది. ఉన్నత న్యాయస్థానం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా ఈ విధంగా ప్రవర్తించడం సముచితం కాదు. దళిత అధ్యాపకులను చిన్న చూపు చూసే విధంగా వ్యవహరించడం దారుణం. అన్ని అర్హతలు, ఎంపికలతోనే అడ్‌హాక్‌, అడ్జంక్ట్‌ అధ్యాపకులుగా ఎంపికయ్యాం. ఏయూ యంత్రాంగం తీరును హైకోర్టు దృష్టికి తీసుకువెళతాం.

– విక్టర్‌, అడ్‌హాక్‌ అధ్యాపకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement