ఆయువు పోస్తున్న
మరణం తర్వాత ఇతరుల జీవితాల్లో వెలుగులు ప్రపంచ అవయవదాన పక్షోత్సవాలు
బీచ్‌రోడ్డు : పాంచభౌతికమైన ఈ శరీరానికి ప్రాణం ఉన్నంత వరకే విలువ అనే పాత మాటను నేటి ఆధునిక వైద్యశాస్త్రం తిరగరాస్తోంది. పార్థివదేహం మట్టిలో కలసిపోయే ముందు, కట్టెలో కాలిపోక ముందే మరొకరికి పునర్జన్మనిచ్చి మృత్యువును జయించవచ్చని నిరూపిస్తోంది. దేహం నిష్క్రమించినా, అవయవాన్ని సజీవంగా ఉంచి తోటి వారి ప్రాణాలను నిలబెట్టడం కంటే మించిన గొప్ప కార్యం మరొకటి లేదు. రోగి ప్రాణాలు కాపాడే వైద్యుడిని శ్రీమన్నారాయణుడితో పోల్చుతాం.. కానీ ఎలాంటి విద్య రాని సామాన్యుడు సైతం ఒక్క నిర్ణయంతో అమరుడై, మరో ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ప్రపంచ అవయవ దాన పక్షోత్సవాలు సందర్భంగా ప్రత్యేక కథనం.
అవయవ మార్పిడే సంజీవని
మన శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల వంటి కీలక అవయవాలు అవసరానికి కంటే పది రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ లేదా తీవ్ర అనారోగ్య సమస్యల వల్ల ఈ మిగులు సామర్థ్యం క్షీణించిపోతుంది. ఉదాహరణకు డయాలసిస్ పై ఆధారపడే వారికి హానికారకాలతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గి గుండెజబ్బుల ముప్పు పెరుగుతుంది. ఇలాంటి తరుణంలో వ్యాధిగ్రస్తుడి ఆయుష్షును పెంచేందుకు ‘ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ ఒక్కటే ఏకై క మార్గంగా మారుతోంది.
కాలంతో పోటీ.. అత్యంత సురక్షితం
సేకరించిన అవయవాలను నిర్ణీత సమయంలోగా మార్పిడి చేయడం అత్యంత కీలకం. గుండె, ఊపిరితిత్తుల జీవిత కాలం సగటున 4 గంటలు మాత్రమే కాగా, కాలేయం 12 గంటలు, మూత్రపిండాలు 30 గంటల వరకు పనిచేస్తాయి. దాత ఆరోగ్యం, బ్లడ్ గ్రూప్, వ్యాధి నిరోధక వ్యవస్థను క్షుణ్ణంగా పరీక్షించాకే వైద్యులు సంపూర్ణ భద్రతతో ఈ ప్రక్రియను చేపడతారు.
విశాఖ చైతన్యం.. ప్రభుత్వ ఆసరా
మన దేశంలో దాదాపు 2.85 లక్షల మంది అవయవాల కోసం ఎదురుచూస్తుంటే, దాతల సంఖ్య కేవలం 12 వేలుగానే ఉంది. ఈ విషయంలో స్వీడన్, బ్రెజిల్, శ్రీలంక వంటి చిన్న దేశాల కంటే మనం వెనుకబడి ఉన్నాం. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో ‘జీవన్‌దాన్’ పథకం ద్వారా ఇప్పటివరకు 122 మంది అవయవ దానానికి ముందుకొచ్చారు. నగరానికి చెందిన సావిత్రిభాయి పూలే ట్రస్ట్ వంటి సంస్థల విస్తృత ప్రచారంతో ఇక్కడ ఒక్క విశాఖలోనే 150 మందికి పైగా శరీర దానాలు చేయడం విశేషం.
ముందున్న సవాళ్లు.. కావాల్సిన ప్రోత్సాహం
ఒక బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి సిద్ధాంతపరంగా 110 రకాల కణజాలాలు, అవయవాలు సేకరించే వీలున్నా, మన వద్ద అధునాతన సాంకేతిక పరికరాల కొరత వల్ల కేవలం 8 కీలక అవయవాలను మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ‘కెడావర్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ యూనిట్లను బలోపేతం చేయడంతో పాటు పాఠశాల స్థాయి నుంచే అవయవదానంపై పాఠ్యాంశాలను చేర్చాల్సిన అవసరం ఉంది. బ్రెయిన్ డెడ్ దాతల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసాతో పాటు అర్హులైన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మరింతమంది ఉదారంగా ముందుకు వచ్చి మృత్యువుపై మానవత్వాన్ని గెలిపిస్తారు.
ఎవరు అర్హులు? ఏ అవయవాలు ఇవ్వొచ్చు?
క్యాన్సర్, హెచ్‌ఐవీ, తీవ్ర ఇన్ఫెక్షన్లు, అవయవ సంబంధిత వ్యాధులు ఉన్నవారు మినహా మిగిలిన ఆరోగ్యవంతులంతా దానానికి అర్హులే. జీవించి ఉన్నవారు తమ రెండు కిడ్నీల్లో ఒకటి, కాలేయం, ఊపిరితిత్తులు, క్లోమం, చిన్నపేగుల్లో కొంత భాగాన్ని సమీప బంధువులకు చట్టబద్ధంగా దానం చేయవచ్చు. ముఖ్యంగా కాలేయానికి ఉండే పునరుత్పత్తి శక్తి వల్ల దాతలో అది తిరిగి వేగంగా పెరుగుతుంది. ఇక బ్రెయిన్ డెడ్ అయిన దాతల నుంచి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, పాంక్రియాస్, చిన్నపేగు వంటి కీలక అవయవాలతో పాటు కార్నియా, చర్మం, ఎముకలు, గుండె కవాటాలను సేకరించి బాధితులకు అమర్చవచ్చు.


