పంచదార్లను వదలమంటే రాములోరి కొండపై పడ్డారు | - | Sakshi
Sakshi News home page

పంచదార్లను వదలమంటే రాములోరి కొండపై పడ్డారు

Aug 5 2026 2:23 AM | Updated on Aug 5 2026 2:23 AM

అనకాపల్లి జిల్లాలో కూటమి నేతల అక్రమ తవ్వకాలు

పరిశీలించడానికి వెళ్లిన ‘సాక్షి’ టీవీ బృందంపై దౌర్జన్యం

అక్రమ కేసులు, యాక్సిడెంట్‌

కేసు పెడతామంటూ బెదిరింపులు

సాక్షి, అనకాపల్లి: రాంబిల్లి మండలంలో కూటమి నేతలు పవిత్రమైన పంచదార్ల కొండను అక్రమంగా తవ్వేయడాన్ని వైఎస్సార్‌సీపీ అడ్డుకోవడంతో ఇప్పుడు రాంబిల్లిలోని రాముల వారి కొండను తొలిచేయడం మొదలెట్టారు. దేవుడు కొలువై ఉన్న కొండను అక్రమంగా తవ్వేస్తున్న వైనాన్ని చిత్రీకరించేందుకు మంగళవారం కొండపైకి వెళ్లిన ‘సాక్షి’ టీవీ బృందంపై కూటమి నాయకులు, వారి గూండాలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాము తల్చుకుంటే ఏ కేసయినా పెడతామని, కారు యాక్సిడెంట్‌ కేసు కూడా పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇటీవల రాంబిల్లి మండలంలో పవిత్ర పంచదార్ల కొండను చంద్రబాబు కూటమి నేతలు అక్రమ మైనింగ్‌ చేస్తూ ఇష్టారీతిని తవ్వేస్తుండటంతో వైఎస్సార్‌సీపీ అడ్డుకొంది. ఈ అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని, పంచదార్ల కొండను నోమైనింగ్‌ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆందోళనలు తీవ్రతరం చేయడంతో ప్రభుత్వం మైనింగ్‌ నిలిపివేసింది. దీంతో కూటమి అక్రమార్కులు రాంబిల్లిలోనే ఉన్న రాములవారి కొండపై పడ్డారు. అక్కడ దేవుడు ఉన్నాడన్న విషయాన్ని, కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన తవ్వకాలు మొదలెట్టారు. ఈ విషయం తెలుసుకుని ‘సాక్షి’ టీవీ బృందం అక్కడకు వెళ్లి అక్రమ తవ్వకాలను చిత్రీకరిస్తుండగా కూటమి నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మైనింగ్‌ ప్రాంతంలోకి వెళ్లకుండా కూటమి నాయకులు మైలపల్లి నాగరాజు, చింతకాయల కాశిరావు, ఎరిపల్లి గోవిందకృష్ణ, మైలపల్లి పైడిరాజుతో పాటు మరో ఆరుగురు ‘సాక్షి’ బృందంపై దౌర్జన్యానికి దిగారు. మీరు వీడియోలు తీస్తే అక్రమ కేసులు పెడతామని, కారు యాక్సిడెంట్‌ కేసులు కూడా పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రభుత్వం మాది.. ఎటువంటి కేసయినా పెడతాం అంటూ బెదిరించినట్లు సాక్షి మీడియా బృందం తెలిపింది.

సాక్షి టీవీ బృందంపై దౌర్జన్యం చేయడం సమర్ధనీయం కాదు

వైఎస్సార్‌సీపీ నేతలు

గుడివాడ అమర్‌నాథ్‌, కె.కె.రాజు

సాక్షి టీవీ బృందంపై దౌర్జన్యానికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. అక్రమ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించడానికి వీల్లేదంటూ సాక్షి బృందాన్ని అడ్డుకోవడమే కాకుండా, వీడియో తీస్తే అక్రమ కేసులు పెడతామని బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో వార్తలను సేకరించి ప్రజలకు చేరవేసే హక్కు, స్వేచ్ఛ మీడియాకు ఉన్నాయని, మీడియాపై దాడులు, బెదిరింపులు, అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సాక్షి బృందాన్ని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ మైనింగ్‌పై సమగ్ర విచారణ జరిపి నిజాలను ప్రజల ముందుంచాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement