పుట్టింది.. పెరిగింది అక్కడే. పెళ్లయ్యాక కూడా జీవితంలో ఎక్కువ భాగం అదే పాతనగరంలో గడిచింది. కాలం మారింది. పరిస్థితులు మారాయి. నివాసం భీమిలి మంగమారిపేటకు మారింది. అయినా ప్రతి నెలా ఒకసారి పాతనగరానికి రావడం మాత్రం ఆమె జీవితంలో విడదీయరాని భాగంగానే మిగిలింది. చివరికి తనకు జీవితం ఇచ్చిన ఆ నేలపైనే ఆమె చివరి శ్వాస విడిచింది. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టౌన్‌కొత్తరోడ్డు వద్ద మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వాసుపల్లి ఎల్లయ్యమ్మ దుర్మరణం చెందింది. – డాబాగార్డెన్స్
వాసుపల్లి అప్పన్న డీఎల్‌బీలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. దంప తులు ఎన్నోఏళ్లుగా కొబ్బరితోట ప్రాంతంలో నివసించారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పిల్లలందరికీ వివాహాలు జరిపించి జీవితాన్ని గడిపారు. అయితే విధి మరోసారి వారిని పరీక్షించింది. నలుగురు పిల్లల్లో ముగ్గురు వివిధ కారణాలతో మృతిచెందడంతో ఆ కుటుంబంపై విషాదం అలుముకుంది. ప్రస్తుతం వారి కుటుంబంలో మనవరాలు, మనవడు మాత్రమే ఉన్నారు. భర్త అప్పన్న మరణించిన తర్వాత ఎల్లయ్యమ్మ మంగమారిపేటలో నివసిస్తూ ఆయన కుటుంబ పెన్షన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి నెలా పెన్షన్ తీసుకోవడానికి పోర్టు సమీపంలోని యూనియన్ బ్యాంక్‌కు వచ్చి, ఆ తర్వాత పాతనగరంలో ఉన్న తన మనవరాలు, మనవడిని చూసి తిరిగి వెళ్లడం ఆమెకు అలవాటు.
అదే అలవాటు... ఈసారి
ఆమె ప్రాణాలనే బలి తీసుకుంది
మంగళవారం ఉదయం మంగమారిపేట నుంచి పాతనగరానికి చేరుకున్న ఎల్లయ్యమ్మ, బ్యాంక్‌కు వెళ్తున్న సమయంలో టౌన్‌కొత్తరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. జీవితమంతా పాతనగరంతో అనుబంధం పెంచుకున్న ఎల్లయ్యమ్మ... చివరికి అదే పాతనగరం ఆమెకు చివరి మజిలీగా మారడం స్థానికులను కలచివేసింది. ఎల్లయ్యమ్మ మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మంగమారిపేటకు తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


