ఆరిలోవ: హెల్త్‌సిటీలోని ఆస్పత్రుల నిర్వాహకులు తప్పనిసరిగా జీవీఎంసీ బల్క్ వాటర్‌ను వినియోగించాలని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ పల్లంరాజు సూచించారు. మంగళవారం హెల్త్‌సిటీలోని పలు ఆస్పత్రులను ఆయన తనిఖీ చేసి, నీటి నిల్వ సంప్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని ఆస్పత్రులు అనధికారికంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నట్లు గుర్తించి సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. ప్రతి ఆస్పత్రి తప్పనిసరిగా జీవీఎంసీ నుంచి బల్క్ వాటర్ కనెక్షన్ తీసుకుని నీటిని వినియోగించాలని, అనుమతి లేకుండా భూగర్భ జలాలను వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించారు. గతంలో బల్క్ వాటర్ కనెక్షన్ తీసుకున్న కొన్ని ఆస్పత్రులు కూడా భూగర్భ జలాలను వినియోగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఆస్పత్రుల వల్ల భూగర్భ జలాల వినియోగం పెరగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అందువల్ల బల్క్ వాటర్ కనెక్షన్ లేని ఆస్పత్రులు వారం రోజుల్లోగా జీవీఎంసీకి దరఖాస్తు చేసుకోవాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.తనిఖీల్లో నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు, ఉప ఇంజనీర్లు, సహాయక ఇంజినీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నోటీసులు జారీచేసిన జీవీఎంసీ అధికారులు


