ఆరిలోవ: ఆరిలోవ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీచ్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం సోమవారం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని పోలీసులు కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఆరిలోవ సీఐ ఎస్. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. తెన్నేటి పార్కు సమీపంలోని బీచ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన నౌక సమీపంలో సోమవారం మధ్యాహ్నం మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు సమాచారం అందింది. కమ్యూనిటీ గార్డుల సహాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చి పరిశీలించారు. మృతుడి ఎడమ చేతిపై ‘సతీష్’ అనే టాటూ, కుడి చేతిపై పులి ముఖం టాటూ ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇతర వివరాలు తెలియకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుడిని గుర్తించే సమాచారం ఉన్నవారు..బంధువులు ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని సీఐ కోరారు.


