ఆరిలోవ: ఆరిలోవ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం నాయకులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ 40 గజాల కాలనీ నుంచి దుర్గాబజార్ మీదుగా లీలాసుందరి నగర్ వరకు సాగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి. కుమార్ మాట్లాడుతూ 10 నుంచి 13 వార్డుల్లో మూడు, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే జీవీఎంసీ కుళాయి నీరు సరఫరా చేస్తోందని, బోర్లు ఎండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. జీవీఎంసీ అధికారులు స్పందించి ప్రతిరోజూ గంట చొప్పున కుళాయి నీరు అందించాలని డిమాండ్ చేశారు. నీటి సమస్య పరిష్కారం కోసం ఈ నెల 7న బాలాజీనగర్‌లోని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి. కృష్ణారావు, స్థానిక నేతలు వి.ఎన్. కుమార్, పి. శంకర్, కె. కుమారి, వెంకటరావు, రమణమ్మ పాల్గొన్నారు.


