నగరంలో ప్రమాదకర స్థాయికి భూగర్భ జలాలు
ఆరిలోవలో 37.08 మీటర్ల లోతుకు పడిపోయిన పాతాళ జలసిరి గతేడాదితో పోలిస్తే 13 మీటర్ల మేర క్షీణించిన నీటిమట్టం ఎండాడలో 30, మధురవాడలో 27, రుషికొండలో 22 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు ఎల్‌నినో, తీవ్ర వర్షాభావం, అధిక నీటి వినియోగంతో ఇంకిపోతున్న ఆక్విఫర్లు
బోర్లు ఎండిపోతున్నాయి
భూగర్భ జలవనరుల పరిస్థితి (మీటర్లలో)
ప్రాంతం జూలై 30 జూలై 30 వ్యత్యాసం
2026 2025
ఆరిలోవ 37.08 23.75 –13.33
ఎండాడ 30.92 20.05 –10.86
మధురవాడ 27.21 22.94 –4.27
రుషికొండ 22.99 6.0 –16.99
విశాఖ రూరల్ 21.83 13.41 –8.42
విశాలాక్షినగర్ 16.18 5.83 –10.35
శివాజీపాలెం 15.64 7.22 –8.34
కణితి 15.24 14.40 –0.84
పెందుర్తి 13.11 10.27 –2.84
అప్పూఘర్ 12.68 7.42 –5.26
గోపాలపట్నం 11.16 2.64 –8.52
సీతమ్మధార 11.45 9.80 –1.65
మహరాణిపేట 10.42 8.19 –2.23
సాక్షి, విశాఖపట్నం: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, నైరుతి రుతుపవనాల కాలంలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో విశాఖ మహా నగరం ఊహించని జల సంక్షోభం అంచున నిలిచింది. వర్షపాతం భారీగా తగ్గిపోవడంతో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో అడుగంటుతున్నాయి. భూగర్భ జలశాఖ తాజా గణాంకాల ప్రకారం అర్బన్, రూరల్ పరిధిలోని పలు కీలక ప్రాంతాల్లో నీటిమట్టం ప్రమాదకరంగా పడిపోగా, తీర ప్రాంతాల్లోకి సముద్రపు ఉప్పునీరు చొరబడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో తాగునీటి నాణ్యత దెబ్బతినే ప్రమాదం నెలకొంది. గతేడాదితో పోలిస్తే అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పదుల మీటర్ల మేర దిగజారడం భవిష్యత్తులో నగరవాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులను సూచిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే విశాఖపై తీవ్రమైన జల సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వర్షాభావంతో అడుగంటుతున్న అక్విఫర్లు
విశాఖ నగరం పారిశ్రామికంగా, జనాభాపరంగా వేగంగా విస్తరిస్తున్నా, అదే స్థాయిలో భూగర్భ జలాల రీచార్జ్ జరగడం లేదు. దీంతో భూగర్భ జల నిల్వలు (అక్విఫర్లు) వేగంగా క్షీణిస్తున్నాయి. భూమిలోని ఇసుక, గులకరాళ్లు, సున్నపురాయి, పగుళ్లు ఉన్న రాళ్ల పొరలు నీటిని నిల్వ ఉంచే సహజ జలాశయాలుగా పనిచేస్తాయి. వీటినే శాసీ్త్రయ పరిభాషలో ’అక్విఫర్లు’ అంటారు. వర్షాభావం కారణంగా ఈ అక్విఫర్లు తిరిగి నిండడం లేదు. మరోవైపు రీచార్జ్ అయ్యే పరిమాణం కంటే అధికంగా నీటిని తోడేయడంతో అవి ఖాళీ అవుతున్నాయి. ఈ ఖాళీల్లోకి సముద్రపు ఉప్పునీరు చొరబడే ప్రమాదం పెరుగుతోంది.
భవిష్యత్తులో జల సంక్షోభమే..
పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా నగరంలో వేల సంఖ్యలో బోర్లు తవ్వుతున్నారు. ఎత్తయిన భవనాల్లో భారీ మోటార్లతో నిరంతరం నీటిని తోడేయడం వల్ల భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఇక గతేడాది రుతుపవనాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమిలోని తేమ వేగంగా తగ్గిపోయింది. దీనికి తోడు నీటి సంరక్షణ చర్యలు, వర్షపు నీటి నిల్వ వ్యవస్థల అమలులో నిర్లక్ష్యం పరిస్థితిని మరింత దిగజార్చింది. నిబంధనల ప్రకారం ప్రతి భవనంలో ఏర్పాటు చేయాల్సిన రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు సమర్థంగా అమలు కాకపోవడం కూడా ప్రధాన కారణంగా మారింది.
పెరుగుతున్న స్ట్రెస్ జోన్లు
నగరంలోని పలు ప్రాంతాలు ప్రస్తుతం భూగర్భ జలాల తీవ్ర కొరత కారణంగా స్ట్రెస్ జోన్లుగా మారుతున్నాయి. సాధారణంగా భూగర్భ జలాలు 10 మీటర్లలోపు ఉంటే సురక్షిత స్థాయిగా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువ లోతుకు వెళ్తే ఆ ప్రాంతాన్ని స్ట్రెస్ జోన్‌గా గుర్తిస్తారు. విశాఖ చరిత్రలోనే తొలిసారిగా ఆరిలోవలో భూగర్భ జలాలు 37.08 మీటర్ల లోతుకు పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ప్రాంతాలు నగరంలో పెరుగుతుండటం ప్రమాదకర పరిణామమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పుఘర్ వంటి తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలు మరింత తగ్గితే సముద్రపు ఉప్పునీరు భూమిలోకి చొరబడే (సాల్ట్‌వాటర్ ఇంట్రూషన్) ప్రమాదం ఉంది. అలా జరిగితే ప్రస్తుతం ఉన్న మంచినీరు కూడా తాగడానికి, గృహావసరాలకు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, ఐటీ కారిడార్, కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.
నీరు కొనుక్కోవాల్సి వస్తోంది
మా ప్రాంతంతో పాటు చుట్టుపక్కల కాలనీల్లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. జీవీఎంసీ కుళాయిలు ఉన్నా నీరు సన్నని ధారగా మాత్రమే వస్తోంది. ఇంటి ముందు గోతులు తీసి నీరు పట్టుకున్నా నాలుగు, ఐదు బిందెలు కూడా రావు. తాగడానికి ఆర్‌వో ప్లాంట్ల నుంచి నీరు కొనుక్కోవాల్సి వస్తోంది. ఆ నీరు కూడా అందరికీ సరిపోవడం లేదు. ఎన్నేళ్లుగానో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
–తిప్పాన నాగమణి, గృహిణి, నగరంపాలెం
ఎండిపోయిన ముడసర్లోవ జలాశయం
మధురవాడ, పీఎంపాలెం ప్రాంతాల్లో భూగర్భ జలాలు తీవ్రంగా తగ్గిపోయాయి. ఎక్కడ చూసినా బోర్లు ఎండిపోతున్నాయి. అపార్ట్‌మెంట్‌లలో ఎక్కువగా ట్యాంకర్ల ద్వారానే నీరు తెప్పిస్తున్నారు. ఇల్లు అద్దెకు లేదా కొనుగోలు చేసేవారు కూడా ముందుగా నీటి సమస్య ఉందా అని ఆరా తీస్తున్నారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఆస్తుల విలువ కూడా 20 నుంచి 30 శాతం వరకు తగ్గుతోంది.
–రాంప్రసాద్, ప్రతినిధి, మధురవాడ పౌర సంక్షేమ సంఘం
తాగునీటికి తీవ్ర ఇబ్బందులు
పైనాపిల్ కాలనీ సమీపంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో సుమా రు రెండు నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ జీవీఎంసీ కుళాయి సౌకర్యం లేదు. గతంలో సంప్ నుంచి బోరు నీటిని మోటారుతో పై ట్యాంక్‌కు ఎక్కించేవారు. కానీ భూ గర్భ జలాలు అడుగంటిపోవడంతో ఇప్పుడు ట్యాంక్ కూడా నిండడం లేదు. జీవీఎంసీ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా, ఒక్కో కుటుంబానికి రెండు, మూడు బిందెల కంటే ఎక్కువ దొరకడం లేదు. చేతి బోరింగులూ ఎండిపోవడంతో తాగడానికి కూడా నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది.
–నసీమా బేగం, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ, పైనాపిల్ కాలనీ


