కేజీహెచ్‌లో వాస్క్యులర్‌ వైద్యుడు లేక రోగుల అవస్థలు | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌లో వాస్క్యులర్‌ వైద్యుడు లేక రోగుల అవస్థలు

Aug 2 2026 12:52 AM | Updated on Aug 2 2026 12:52 AM

వారికోస్‌ వెయిన్స్‌ బాధితులకు చికిత్స అందక ఇబ్బందులు

మహారాణిపేట: కేజీహెచ్‌లో వాస్క్యులర్‌ సర్జన్‌ లేకపోవడంతో వారికోస్‌ వెయిన్స్‌తో పాటు రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొద్ది నెలల క్రితం కేజీహెచ్‌లో పనిచేస్తున్న వాస్క్యులర్‌ వైద్యుడ్ని పలాస ప్రభుత్వాస్పత్రికి బదిలీ చేయడంతో ప్రస్తుతం ఆ విభాగంలో నిపుణుడు లేకుండా పోయారు. దీంతో రోగులు చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వాసుపల్లి గణేష్‌కుమార్‌ కేజీహెచ్‌లో వాస్క్యులర్‌ వైద్యుడి అవసరాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆదేశాల మేరకు వైద్యుడిని నియమించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ వైద్యుడిని పలాసకు బదిలీ చేయడంతో మళ్లీ కేజిహెచ్‌లో వాస్క్యులర్‌ సేవలు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు.

హైబీపీ, మధుమేహంతో ప్రమాదం

మధుమేహం, అధిక రక్తపోటు, ధూమపానం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల రక్తప్రసరణ దెబ్బతిని వారికోస్‌ వెయిన్స్‌తో పాటు ఇతర వాస్క్యులర్‌ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. రక్తం గడ్డకట్టడం, ధమనులు మూసుకుపోవడం వంటి సమస్యలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందన్నారు.

ఖరీదైన చికిత్స : వారికోస్‌ వెయిన్స్‌కు నిపుణులైన వైద్యులు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సకు సుమారు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుండగా, గతంలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందుబాటులో ఉండేది. ప్రస్తుతం నగరంలో వాస్క్యులర్‌ నిపుణుడు లేకపోవడంతో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రామలక్ష్మికి అండగా వాసుపల్లి

వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు, రెల్లి సామాజిక వర్గానికి చెందిన దశమంతుల రామలక్ష్మి హై షుగర్‌ కారణంగా రక్తం గడ్డకట్టి వారికోస్‌ వెయిన్స్‌ సమస్యతో మంచానికే పరిమితమైన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ శనివారం ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం పలాస ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వాస్క్యులర్‌ వైద్యుడితో ఫోన్‌లో మాట్లాడి రామలక్ష్మికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. దీనికి వైద్యుడు సానుకూలంగా స్పందించి అవసరమైన చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు. రామలక్ష్మి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాసుపల్లి వెంటనే రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన సహకారంతో మంగళవారం ఆమెను పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ దశమంతుల రామలక్ష్మి గతంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలిగా సేవలందించడంతో పాటు పార్టీ, సమాజం కోసం విశేషంగా పనిచేశారని అన్నారు. కష్టకాలంలో అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వాసుపల్లి అందించిన సహాయానికి రామలక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement