భోగాపురం సభకు ‘ఆర్టీసీ’ | - | Sakshi
Sakshi News home page

భోగాపురం సభకు ‘ఆర్టీసీ’

Aug 2 2026 12:52 AM | Updated on Aug 2 2026 12:52 AM

ప్రయాణికులకు తిప్పలు

డాబాగార్డెన్స్‌: విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున జనసమీకరణకు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరైన ఈ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా జనాలను తరలించేందుకు శుక్రవారం రాత్రి నుంచే సగానికి పైగా బస్సులను కేటాయించారు.

తీవ్రమైన బస్సుల కొరత

విశాఖ రీజియన్‌ పరిధిలోని అనకాపల్లి, పాడేరు, అరకు, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట తదితర ప్రాంతాల నుంచి వందలాది బస్సులను భోగాపురానికి తరలించారు. విశాఖ నగరంలో ఇప్పటికే పరిమిత సంఖ్యలోనే బస్సులు అందుబాటులో ఉండగా, అందులోనూ కొన్ని మరమ్మతుల కారణంగా డిపోలకే పరిమితమయ్యాయి. ఉన్న కొద్దిపాటి బస్సులను సభకు తరలించడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.

ప్రయాణికులు, ఉద్యోగుల విలవిల

విశాఖ నుంచి నిత్యం విజయనగరం, శ్రీకాకుళం, రాజాం, పలాస, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, అనకాపల్లి తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, రైల్వే ప్రయాణికులు గంటల తరబడి బస్‌ స్టాండ్లలో నిరీక్షించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్ర రద్దీ నెలకొని ప్రయాణికులు చుక్కలు చూశారు. ప్రజాప్రతినిధుల సభల కోసం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement