మహారాణిపేట: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టి, సంకల్పం, పరిపాలనా సామర్థ్యానికి ప్రతీక అని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సుమారు 2,700 ఎకరాల భూసేకరణ, రైతులకు పరిహారం చెల్లింపు, జీఎంఆర్ సంస్థకు అనుమతులు, పరిపాలనా సహకారం అందించి ప్రాజెక్టును వేగవంతం చేసింది జగన్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన సమయంలోనే 2026 నాటికి విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని జగన్ ప్రకటించారని, అదే లక్ష్యంతో ప్రభుత్వం పనులను ముందుకు తీసుకెళ్లిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సిద్ధమైన ప్రాజెక్టును ప్రారంభించడం మినహా కొత్తగా చేసినదేమీ లేదని విమర్శించారు. ప్రాజెక్టు పునాది నుంచి నిర్మాణ పురోగతి వరకు జరిగిన కృషిని పక్కనబెట్టి, ప్రారంభోత్సవం పేరుతో మొత్తం ఘనతను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం రాజకీయ క్రెడిట్ దోపిడీ అని కేకే రాజు మండిపడ్డారు. ఎల్లో మీడియా ద్వారా భోగాపురం ఎయిర్‌పోర్టును చంద్రబాబు ప్రభుత్వ ఘనతగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించే ప్రయత్నమేనని అన్నారు. అభివృద్ధి అంటే ప్రారంభోత్సవాలు చేయడం కాదని, ప్రాజెక్టుకు పునాది వేసి పూర్తి చేసే వరకు కట్టుబాటుతో పనిచేయడమే నిజమైన నాయకత్వమని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు చరిత్రలో జగన్ పాత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని, క్రెడిట్‌ను దక్కించుకునే రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.


