మహారాణిపేట: కనీస వేతనాల అమలు డిమాండ్‌తో కార్మికులు చేపట్టిన ఛలో కలెక్టరేట్‌తో కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం హోరెత్తింది. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నగరంలో భారీ ర్యాలీ, ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. సరస్వతి పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ప్రధాన ద్వారాల వద్ద ధర్నా చేపట్టారు. లోపలికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగ్‌రావు మాట్లాడుతూ, షెడ్యూల్డ్ పరిశ్రమల్లో భాగమైన చిన్న పరిశ్రమలు, షాపులు, షాపింగ్ మాల్స్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకుల్లో గత 20 ఏళ్లుగా కనీస వేతనాల సవరణ జరగలేదన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కనీస వేతనం 20 శాతం, కర్ణాటకలో 60 శాతం పెంచిన విషయాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు గుర్తించడంలేదని ఆక్షేపించారు. ప్రస్తుతం సరాసరి రూ.6 వేలు–రూ.12 వేలు జీతాలుగా ఉన్నాయని, పెరిగిన ధరలతో పోల్చితే ఇవి ఏ మూలకూ సరిపోవన్నారు. ఆర్టీసీ, విద్యుత్, మున్సిపల్ రంగాల్లో ప్రైవేటీకరణ విధానాలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కేఎం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ఆర్‌వీ కుమార్ మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలన్నారు. జీవీఎంసీ, ప్రభుత్వ ఆసుపత్రులు, ఎస్‌ఎస్‌ఏ తదితర శాఖల కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని నాయకురాలు పి.మణి డిమాండ్ చేశారు. విశాఖ డెయిరీ, స్టీల్ ప్లాంట్, సినర్జీ పరిశ్రమల్లో తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఆధార్ కార్డు స్తంభనను ఎత్తివేయాలని సీఐటీయూ నాయకుడు ఎం.జగ్గునాయుడు కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బి.జగన్, ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, పి.వెంకట్రావు, ఎం.సుబ్బారావు, అప్పారావు, ఉరుకూటి రాజు, నూకరాజు, అనసూయ, రాంబాబు,నమ్మి రమణ, సోమేష్, సత్యవతి పాల్గొన్నారు.


