విశాఖ విమానాశ్రయంలో పనిచేస్తున్న సుమారు 160 మంది హౌస్‌కీపింగ్ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు వైఎస్ జగన్‌ను కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. వచ్చే నెల నుంచి విమాన కార్యకలాపాలు భోగాపురం విమానాశ్రయానికి మారనున్న నేపథ్యంలో, అక్కడ ఇదే వేతనంతో విధులు నిర్వహించడం కష్టమన్నారు. ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలో రూ.18 వేల వేతనానికి పని చేస్తున్నామని, ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టుకు వెళ్లితే రూ.13 వేలు మాత్రమే ఇస్తామని ఏజెన్సీ వారు చెప్పినట్లు కార్మికులు వాపోయారు. ఉన్న జీతాన్ని కూడా తగ్గించి దూరంగా వెళ్లమనడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త యాజమాన్యం వద్ద తమకు ఉపాధి కల్పించడంతో పాటు, భోగాపురం వెళ్లలేని వారికి విశాఖలోనే ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి న్యాయం జరిగేలా ఒత్తిడి తీసుకొస్తానని జగన్ హామీ ఇచ్చారు. అలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్లకు పైగా అనుభవం ఉన్న కార్మికులకు ఆయా ఏజెన్సీ నుంచి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో కార్మికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో కార్మికులు జి.అప్పారావు, ఎస్.తరుణ్‌కుమార్, కె.జగదీష్, కె.నాగేశ్వరరావు, వై.శాంతి, కె.లక్ష్మి ఉన్నారు.


